మూసీ ఉగ్రరూపం.. MGBS‎కు వెళ్లే దారులన్నీ క్లోజ్.. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి..!

మూసీ ఉగ్రరూపం.. MGBS‎కు వెళ్లే దారులన్నీ క్లోజ్.. ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి..!

హైదరాబాద్: గత రెండు రోజులుగా నగరంలో కురుస్తోన్న కుండపోత వర్షాలతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో ప్రాజెక్ట్ గేట్లు ఓపెన్ చేసి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. జంట జలాశయాల గేట్లు తెరవడంతో మూసీకి వరద పొటెత్తింది. ఎంజీబీఎస్, చాదర్‎ఘాట్, మూసారాం బాగ్ వద్ద మూసీ మహోగ్రరూపం దాల్చింది. 

మూసీ వరద ఉధృతికి ఎంజీబీఎస్ పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. మూసారాం బాగ్ బ్రిడ్జి దగ్గర 10 అడుగుల మేర వరద ప్రవాహం కొనసాగుతోంది.  చాదర్ ఘాట్ లోయర్ బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. మూసీ అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్ వైపు వెళ్లే దారులన్నీ క్లోజ్ చేశారు అధికారులు. ఎంజీబీఎస్‎లోకి బస్సుల రాకపోకలను నిలిపివేశారు. 

దసరా పండగ సీజన్ కావడంతో ప్రయాణికులతో ఎంజీబీఎస్ కిక్కిరిసిపోయింది. బస్టాండ్‎ను వరద ముంచెత్తడంతో ప్రయాణికులు అందులో చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు తాళ్ల సహయంతో ప్రయాణికులను బయటకు తరలించారు. ఎంజీబీఎస్‎కు వచ్చే బస్సులను దారి మళ్లించారు అధికారులు. 

నల్గొండ, ఖమ్మం నుంచి వచ్చే బస్సులను ఎల్బీ నగర్ వరకు.. మహబూబ్ నగర్, కర్నూల్ నుంచి వచ్చే బస్సులు ఆరాంఘర్ వరకు.. వరంగల్, హనుమకొండ నుంచి వచ్చే బస్సులను ఉప్పల్ వరకు మాత్రమే అనుమతిస్తున్నారు అధికారులు. మరోవైపు మూసీ ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ఎంజీబీఎస్, చాదర్ ఘాట్ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది. ఎంజీబీఎస్ చుట్టూ భారీగా బస్సులు, వాహనాలు నిలిచిపోయాయి. 

వరద చుట్టుముట్టడంతో కిలో మీటర్ల మేర ఎక్కడికక్కడ వాహనాలు ట్రాఫిక్‎లో చిక్కుకుపోయాయి. మూసీ ఉగ్రరూపం దాల్చడంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అలర్ట్ అయ్యారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంతం వైపు ఎవరూ వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. ఎంజీబీఎస్‎ పూర్తిగా జలదిగ్భందంలో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు ఎవరూ బస్టాండ్‎కు రావొద్దని ఆర్టీసీ అధికారులు హెచ్చరించారు.