కోహ్లీపై సెహ్వాగ్ అసహనం.. రూల్స్ అతడికి తప్ప అందరికీ వర్తిస్తయ్

కోహ్లీపై సెహ్వాగ్ అసహనం.. రూల్స్ అతడికి తప్ప అందరికీ వర్తిస్తయ్

దాదాపుగా ప్రతి మ్యాచ్‌‌లో ఫైనల్ ఎలెవన్‌‌లో ఏదో ఒక మార్పు చేయడం టీమిండియా కెప్టెన్‌‌ విరాట్ కోహ్లీకి పరిపాటిగా చెప్పొచ్చు. కోహ్లీ ఇలా టీమ్‌‌లో మార్పులు చేయడంపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌‌కు అసహనం వ్యక్తం చేశాడు. ముఖ్యంగా తొలి టీ20లో శ్రేయాస్ అయ్యర్‌‌ను ఆడించకపోవడంపై వీరూ మండిపడ్డాడు. ఆటగాళ్లకు అవకాశాలు కల్పిస్తూ, భరోసా ఇస్తేనే వారిలోని ప్రతిభ మరింతగా బయటపడుతుందన్నాడు.

‘శ్రేయాస్ అయ్యర్ గురించి మాట్లాడితే.. గత టీ20 సిరీస్‌‌లో అతడు బాగా ఆడాడు. అలాంటప్పుడు అతడ్ని ఎందుకు పక్కనబెట్టినట్లు? ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? తనను ఎందుకు ఆడించలేదని అడిగేంత ధైర్యం అయ్యర్‌‌కు ఉందని నేను అనుకోవడం లేదు. టీమ్‌‌ను పరిగణనలోకి తీసుకొని ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇది సరైనదే కావొచ్చు. కానీ షార్ట్ పిచ్ బంతులను ఆడలేడంటూ ఎంపిక చేయకపోతే మాత్రం అది వేరేగా చెప్పొచ్చు. ఎందుకంటే గత టీ20 ఇంటర్నేషనల్ మ్యాచుల్లో అతడు నిలకడగా పరుగులు చేశాడు. కాబట్టి అయ్యర్‌‌కు అవకాశాలు ఇవ్వాలి. నేనింకో విషయం కూడా చెబుతా.. విరాట్ కోహ్లీకి తప్ప అందరికీ రూల్స్ వర్తిస్తాయి. అతడి విషయం ఎలాంటి నిబంధనలూ వర్తించవు. అతడు ఆటకు దూరంగా ఉన్నా, ఫామ్‌‌లో లేకున్నా ఏమైనా సరే అతడి బ్యాటింగ్ ఆర్డర్‌‌‌లో మాత్రం మార్పు ఉండదు. ఇది పెద్ద తప్పు. దీని గురించి కోహ్లీ ఆలోచించుకోవాలి. ఇంగ్లండ్ సిరీస్‌‌లో తాను విఫలమైనప్పుడు పుంజుకోవడానికి అతడికి మళ్లీ అవకాశాలు ఇచ్చారా లేదా కోహ్లీ గుర్తు చేసుకోవాలి. ధోని అతడ్ని కాపాడుతూ వచ్చాడు. అవకాశాలు ఇస్తూ ప్రోత్సహించాడు. మరి ధోనీలా కోహ్లీ ఏ ప్లేయర్‌‌నైనా ప్రోత్సహిస్తూ, అవకాశాలు ఇస్తూ, వెనకేసుకొచ్చాడా?’ అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.