పెద్దపల్లి జిల్లాలో ఇసుక రీచ్​లన్నీ అక్రమమే

పెద్దపల్లి జిల్లాలో ఇసుక రీచ్​లన్నీ అక్రమమే
  • చెక్ డ్యాంలు లేకపోయినా డీ సిల్టేషన్​కు పర్మిషన్
  • దాదాపు రూ.వెయ్యి కోట్ల కుంభకోణం
  • అధికార పార్టీ అండతోనే అక్రమాలు
  • సీనియర్ పొలిటీషియన్ గొట్టిముక్కుల సురేశ్​​రెడ్డి 

పెద్దపల్లి, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్, ఓదెల, కాల్వ శ్రీరాంపూర్ మండలాల్లో ప్రవహిస్తున్న మానేరులో ఇసుక రీచ్​కు ఇచ్చిన అనుమతులన్నీ అక్రమమేనని పెద్దపల్లి నియోజకవర్గం సీనియర్ పొలిటీషియన్ గొట్టిముక్కుల సురేశ్​రెడ్డి ఆరోపించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గొట్టిముక్కుల మాట్లాడారు.  మానేరులో చెక్ డ్యాంల నిర్మాణం జరగకపోయినా డీసిల్టేషన్ పేరుతో దాదాపు రూ. వెయ్యి కోట్ల కుంభకోణానికి అధికారులు  తెరలేపారని, ఇదంతా అధికార పార్టీ అండతోనే జరుగుతున్నదన్నారు. మానేరు వాగు మీద చెక్ డ్యాంల నిర్మాణం కోసం ప్రభుత్వం ఇప్పటికే నిధులు మంజూరు చేసిందని, అయినా ఇప్పటి వరకు ఎక్కడా చెక్​డ్యాంల నిర్మాణం జరగలేదన్నారు. కానీ చెక్ డ్యాంల వద్ద ఇసుక మేటలు వేసిందని, పూడిక తీయాలని, దాని కోసం ఇసుక రీచ్​లను ఏర్పాటు చేసి, ఏకంగా 19 రీచ్​లకు అనుమతులిచ్చారన్నారు. ఇరిగేషన్ శాఖ వాగులో 24 చెక్​డ్యాం నిర్మాణం పూర్తయ్యిందని రిపోర్టు కూడా ఇచ్చిందన్నారు. రైట్​ టు ఇన్ఫర్మేషన్​ యాక్టు ద్వారా సమాచారం సేకరించగా, అందులో చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి కాలేదని ఉందన్నారు. అన్ని విభాగాల అధికారులు ఇసుక రీచ్​ల విషయంలో ఇచ్చిన రిపోర్టులన్నీ తప్పే అని అన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ లెవెల్ ​సాండ్ కమిటీ కూడా నామమాత్రమే అయ్యిందన్నారు. ఇసుక రీచ్​ల టెండర్ కోట్ అనుమతుల వల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఆదాయం రాగా, కాంట్రాక్టర్లు మాత్రం అనుమతులను మించి పదింతలు ఇసుకను తోడుకుపోతున్నారన్నారు. మానేరులో నిర్ధేశించిన 2.5 మీట్లర్లు లోతు ఇసుక మాత్రమే తీయాల్సి ఉండగా 4 మీటర్ల వరకు తోడుతున్నారన్నారు. మైనింగ్ ప్లాన్​లో కాకుండా ఇతర ప్లేసుల్లో కూడా ఇసుక తవ్వుతున్నారన్నారు. తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్​మెంట్​(టీఎస్ ఎండీసీ) నిబంధనలు ఏ ఒక్కటి కూడా పాటించడం లేదన్నారు. ప్రతీ మండల పోలీసుస్టేషన్, తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్​కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ దందా వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యే ఉన్నాడని ఆరోపించారు. ఇసుక రీచ్​లకు అనుమతులు ఇచ్చే ముందు హడావుడి చేసిన మాజీ ఎమ్మెల్యే విజయరమణారావు ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యాడని ప్రశ్నించారు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ కలిసి వచ్చినా తాను ఇసుక రీచ్​లు అక్రమమే అని నిరూపిస్తానని సవాల్ విసిరారు. తన వద్ద ఇసుక రీచ్​ల  అక్రమ అనుమతులకు సంబంధించి పూర్తి ఆధారాలున్నాయన్నారు. రానున్న రోజుల్లో  సమీప గ్రామ ప్రజలందరితో కలిసి ఇసుక రీచ్​లపై కోర్టులో పిల్ వేయనున్నట్లు తెలిపారు.