ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా 9,07,393 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. వారి కోసం 1443 ఎగ్జామినేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. మే 24 వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. ఉదయం 9  గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు. విద్యార్థులను గంట ముందే ఎగ్జామినేషన్ హాల్లోకి పంపుతామని ఇంటర్ బోర్డు ప్రకటించింది. నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించే ప్రసక్తేలేదని స్పష్టం చేసింది. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయనున్నట్లు అధికారులు చెప్పారు. ఫస్టియర్‌ పేపర్లకు సెకండియర్‌లో ఇంప్రూవ్‌మెంట్‌ రాసుకొనే అవకాశాన్ని ఇంటర్ బోర్డు కల్పించింది. 

కొవిడ్ 19 కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న పరీక్షలు కావడంతో అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా 70శాతం సిలబస్ నుంచే ప్రశ్నలు ఇవ్వడంతో పాటు ప్రశ్నలకు ఇచ్చే ఛాయిస్ లను పెంచారు. పరీక్షల సందర్భంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్టూడెంట్స్కు బెస్ట్ విషెస్ చెప్పారు. విద్యార్థులు ఒత్తిడికి గురైతే 18005999333 టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేసి సలహాలు సూచనలు పొందవచ్చని చెప్పారు.