తెలుగు రాష్ట్రాల మధ్య నదీజలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.కేంద్ర జలసంఘం చైర్మన్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది.ఈ కమిటీలో రెండు రాష్ట్రాల జలవనరులశాఖ ఉన్నతాధికారులతో పాటు కమిటీలో కృష్ణా, గోదావరి బోర్డుల చైర్మన్లు సభ్యులుగా ఉన్నారు. ఏపీ, తెలంగాణ నుంచి నలుగురు అధికారుల చొప్పున కమిటీలో చోటు కల్పించింది.
ఈ కమిటీలో తెలంగాణ నుంచి జలవనరుల శాఖ సలహాదారు, ఇరిగేషన్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ సెక్రటరీ, ఇంజనీర్-ఇన్-చీఫ్ సభ్యులుగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి జలవనరుల శాఖ స్పెషల్ సెక్రటరీ, జలవనరుల శాఖ సలహాదారు, ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఇరిగేషన్), చీఫ్ ఇంజనీర్ సభ్యులుగా ఉన్నారు.
Also Read: ప్రజలతో సంప్రదింపులు జరిపాకే.. గ్రేటర్ విలీనం చేశాం
సహకార సమాఖ్య విధానంతో గత 11 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారానికి ఈ కమిటీ పలు సూచనలు చేయనుంది. ఇందుకోసం ప్రత్యేకమైన వేదికలను ఏర్పాటుచేసి సమన్వయంతో సమస్యల పరిష్కారానికి బాటలు వేయనుంది.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన 2025 జూలై 16న ఢిల్లీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కమిటీలో కేంద్ర జలశక్తి శాఖతో పాటు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులు, సాంకేతిక నిపుణులను నియమించాలని సూచించారు. ఏపీ, తెలంగాణ మధ్య ఇటీవల తీవ్ర వివాదస్పదమైన పోలవరం-,బనకచర్ల ప్రాజెక్టుతో పాటు ఇతర వివాదాల పరిష్కారానికి ఈ కమిటీ కృషి చేయనుంది.
