
- స్క్రీనింగ్ బాధ్యతను ఇన్ చార్జి మంత్రులకు అప్పగింత
- నలుగురి పేర్లను హైకమాండ్ కు పంపే యోచన!
- లిస్టులో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు పేర్లు!!
- సామాజిక సమీకరణాలు, విధేయతకే పెద్దపీట
- సీఎంతో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, పొన్నం భేటీలో కీలక చర్చ
హైదరాబాద్: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, జూబ్లీహిల్స్ సెగ్మెంట్ ఇన్ చార్జి మంత్రులు గడ్డం వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానికంగా లేని కారణంగా హాజరు కాలేదు. అభ్యర్థుల స్క్రీనింగ్ బాధ్యతను ముగ్గురు ఇన్ చార్జి మంత్రులకే అప్పగించారు. స్థానికంగా ఉన్న ఆదరణ, పార్టీ పట్ల విధేయతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
సామాజిక సమీకరణాలకు పెద్ద పీట వేయాలని సీఎం కోరారు. ఈ సమావేశంలో నలుగురి పేర్లను పంపించాలని నిర్ణయించారు. వీరిలో నవీన్ యాదవ్, అంజన్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ సీఎన్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లను పీసీసీకి పంపించడంపై చర్చ జరిగింది. వీరిలో సామాజిక సమీకరణలు, పార్టీకి విధేయత, స్థానిక సమీకరణాలను పరిగణలోకి తీసుకొని ఒక పేరును ఫైనల్ చేసే అవకాశం ఉందని సమాచారం.
ఎలాగైనా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలవాల్సిందేనని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు, మంత్రులు వివేక్, పొన్నం లకు సీఎం ఆదేశించారు. సర్వే ఫలితాలు పూర్తిగా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు.
వార్డుల వారిగా, బస్తీల వారిగా పార్టీ కార్యకర్తలతో, జనంతో చిన్న, చిన్న సమావేశాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్బంగా పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తాను జూబ్లీ హిల్స్ లో పాదయాత్ర చేస్తానని చెప్పారు.