2026 టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా యువ ఓపెనర్ శుభమాన్ గిల్ పై వేటు పడిన సంగతి తెలిసిందే. ఆసియా కప్ 2025 నుంచి గిల్ ను బలవంతంగా ఓపెనర్ గా కొనసాగించినా వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడంలో గిల్ విఫలమయ్యాడు. ఫామ్ లేక ఇబ్బందిపడుతున్న గిల్ పై సెలక్టర్లు కఠిన నిర్ణయం తీసుకుని జట్టు నుంచి తప్పించారు. నమ్మకంతో ఎన్ని అవకాశాలు ఇచ్చినా శుభమాన్ వరుసగా విఫలమవుతూ జట్టుకు భారంగా మారాడు. పొట్టి సమరానికి గిల్ ను ఎంపిక చేయకపోవడంతో మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. తాజాగా టీమిండియా దిగ్గజ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్.. గిల్ ను వెనకేసుకొచ్చాడు.
నాలుగు, ఐదు ఇన్నింగ్స్‌లలో విఫలమైనంత మాత్రాన శుభ్‌మాన్ గిల్‌ను జట్టు నుండి తొలగించకూడదని యోగ్‌రాజ్ సింగ్ అన్నారు. 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు నుండి శుభ్‌మాన్ గిల్‌ను తొలగించడంపై ఈ భారత మాజీ క్రికెటర్ ఇండియన్ సెలెక్టర్లపై విమర్శలు గుప్పించాడు. జర్నలిస్ట్ రవీష్ బిష్ట్ తో మాట్లాడుతూ.. భారత క్రికెట్ లో చాలా మంది ఆటగాళ్లకు చాలా అవకాశాలు లభించాయని.. చాలా సందర్భాలలో వారు వృధా చేసినప్పటికీ వారు జట్టులో కొనసాగరని గుర్తు చేశారు. గిల్ ను జట్టులో నుంచి తొలగించడం వెనుక గల కారణాన్ని ఆయన ప్రశ్నించారు.
ఒకవేళ వరుసగా నాలుగు మ్యాచ్ ల్లో విఫలమైనంత మాత్రనా అభిషేక్ శర్మను జట్టులో నుంచి తొలగిస్తుందా అని సెలక్టర్లకు సూటి ప్రశ్న విసిరాడు. "బిషన్ సింగ్ బేడి కెప్టెన్ గా మేము పాకిస్తాన్ లో పర్యటించినప్పుడు, కపిల్ దేవ్ బ్యాటింగ్, బౌలింగ్ లో విఫలమయ్యాడు. కానీ బిషన్ సింగ్ బేడి తరువాత ఇంగ్లాండ్ పర్యటనకు కూడా అతన్ని తీసుకెళ్లాడు. గిల్ ను తప్పించడం తొందరపాటు అవుతుంది". అని యోగరాజ్ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
ఆసియా కప్ నుంచి గిల్ ఘోరంగా విఫలం:
ఆసియా కప్ నుంచి గమనిస్తే గిల్ ఒక్కసారి కూడా హాఫ్ సెంచరీ మార్క్ అందుకోలేకపోయారు. కాన్‌బెరాలో తొలి టీ20లో మాత్రమే కెప్టెన్ సూర్యతో కలిసి కాస్త మెప్పించాడు. ఆ తర్వాత నాలుగో వన్డేలో 46 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో కేవలం 4 పరుగులే చేసి పెవిలియన్ కు చేరాడు. అడపాదడపా ఇన్నింగ్స్ లు తప్పితే గిల్ పెద్దగా రాణించడం లేదు.
గిల్ చివరి 15 ఇన్నింగ్స్ లు చూసుకుంటే 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(0), 28(28) ఇలా ఉన్నాయి. కేవలం 3 సార్లు మాత్రమే 30 పరుగుల మార్క్ అందుకున్నాడు. సౌతాఫ్రికాపై జరిగిన రెండో టీ20లో తొలి బంతికే డకౌటయ్యాడు. మూడో టీ20లో 28 పరుగులు చేసినా 28 బంతులు తీసుకున్నాడు. దీంతో గిల్ స్థానంలో శాంసన్ కు ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్స్ గట్టిగా వినిపించాయి.
