Jana Nayagan Bookings: విజయ్ లాస్ట్ మూవీ క్రేజ్.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ‘జన నాయగన్’

Jana Nayagan Bookings: విజయ్ లాస్ట్ మూవీ క్రేజ్.. అడ్వాన్స్‌ బుకింగ్స్‌లో దూసుకుపోతున్న ‘జన నాయగన్’

కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న చివరి చిత్రం ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). ఖాకి, వలిమై, తెగింపు వంటి థ్రిల్లర్ సినిమాలు తెరకెక్కించిన హెచ్. వినోద్.. ‘జన నాయగన్’ సినిమాను డైరెక్ట్ చేశాడు. కేవీఎన్ ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించింది. సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న తమిళ, తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఇది విజయ్ చివరి సినిమా కావడంతో, ఫ్యాన్స్ మరియు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే, రిలీజైన కంటెంట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే రేపు (జనవరి 3న) ట్రైలర్ రిలీజ్ కానుంది. 

‘జన నాయగన్’ ఓవర్సీస్‌ ప్రీ–సేల్స్:

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘జన నాయగన్’ విడుదలకు ఇంకా వారం రోజులే మిగిలాయి. రిలీజ్‌కు ముందే ఈ సినిమా రికార్డుల వేట మొదలుపెట్టింది. ఇప్పటికే తమిళ వెర్షన్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. . మలేషియాలో ఆడియో లాంచ్ అనంతరం వచ్చిన ట్రేడ్ డేటా ప్రకారం,  ఈ బుకింగ్స్ ద్వారా ఇప్పటివరకు రూ.15 కోట్లకు పైగా గ్రాస్ వసూలైంది. విడుదలకు ముందే ఈ స్థాయి కలెక్షన్స్ సాధించడం సినిమాపై ఉన్న భారీ అంచనాలకు నిదర్శనంగా మారింది. నార్త్ అమెరికా, యూకే, ఆస్ట్రేలియా మార్కెట్లలో మరింత దూకుడుగా ఉంది. ఈ లెక్కలు రోజురోజుకూ మారుతుండటం విశేషం. 

ఇండియాలో బుకింగ్స్ ఎలా ఉంది?

ప్రస్తుతం ‘జన నాయగన్’ బుకింగ్స్ కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో మాత్రమే ఓపెన్ అయ్యాయి. దీనివల్ల, ఇప్పటివరకు రూ.3 కోట్ల వరకు అడ్వాన్స్ కలెక్షన్లు నమోదయ్యాయి. విజయ్‌కు అత్యంత బలమైన మార్కెట్ అయిన తమిళనాడులో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కాలేదు. అక్కడితో పాటు ఇతర కీలక మార్కెట్లలో అంటే.. తెలుగు, హిందీ, మలయాళ భాషాల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే, అడ్వాన్స్ కలెక్షన్లలో భారీ మార్క్ ఉండబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తెలుగు, తమిళ బుకింగ్స్, రానున్న ఈ మూడు రోజుల్లో మొదలయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. 

ఎందుకు ఇంత హైప్?

‘జన నాయగన్’పై ఆసక్తి కేవలం బాక్సాఫీస్ కారణంగానే కాదు. ఇది విజయ్ రాజకీయాల్లో క్రియాశీల ఎంట్రీకి ముందు చేసే చివరి సినిమా కావడం సినిమాపై ప్రత్యేక దృష్టిని తీసుకొచ్చింది. అలాగే ఈ చిత్రం నందమూరి బాలకృష్ణ నటించిన ‘భగవంత్ కేసరి’కి రీమేక్ లేదా ప్రేరణ పొందిందా? అనే చర్చ కూడా సినీ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

రీమేక్ వివాదంపై డైరెక్టర్ హెచ్.వినోద్:

ఈ విషయంపై దర్శకుడు హెచ్. వినోద్ రియాక్ట్ అవుతూ..“మ్యూజిక్ లాంచ్‌లో చెప్పినదే మళ్లీ చెబుతున్నాను. ఇది దళపతి మూవీ. ఇది రీమేకా..? ఏదైనా చిత్రం నుంచి కొన్ని సీన్లు స్ఫూర్తిపొంది తీశారా? అన్న విషయంపై ప్రేక్షకులు ఆందోళనపడాల్సిన అవసరం లేదు. ఒక షో చూడండి.. మీకే సమాధానం దొరుకుతుంది” అని స్పష్టం చేశారు. టీజర్లు, ట్రైలర్లు విడుదలైన కొద్దీ మరింత స్పష్టత వస్తుందని కూడా తెలిపారు.