పాతబస్తీ అగ్ని ప్రమాదం.. మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే

పాతబస్తీ అగ్ని ప్రమాదం.. మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే
  • పాతబస్తీలో ఘోర అగ్నిప్రమాదం 17 మంది మృతి
  • మృతుల్లో ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు
  • జీ ప్లస్​ 2 బిల్డింగ్​లో షార్ట్​ సర్క్యూట్​.. పేలిన 3 ఏసీ కంప్రెషర్లు.. చెలరేగిన మంటలు
  • బయటకు వెళ్లే దారి లేక.. ముగ్గురు సజీవదహనం, ఊపిరాడక మరో 14 మంది కన్నుమూత
  • మృతులంతా అన్నదమ్ముల కుటుంబాలే
  • గెట్​ టుగెదర్​ కోసం కలుసుకొని.. మృత్యుఒడిలోకి
  • ప్రమాద టైమ్​లో బిల్డింగ్​లో దాదాపు 30 మంది
  • ఉదయం 6 గంటల ప్రాంతంలో ఘటన
  • బిల్డింగ్‌ మొత్తానికి టన్నెల్‌ తరహాలో ఒక్కటే ఎగ్జిట్‌, ఎంట్రీ.. పొగతో నిండిపోయిన బిల్డింగ్​
  • హుటాహుటిన రంగంలోకి ఫైర్​ సిబ్బంది, పోలీసులు
  • తొమ్మిది మంది రెస్క్యూ.. సంఘటన స్థలిని పరిశీలించిన మంత్రులు, అధికారులు

గెట్ ​టుగెదర్​ పేరుతో కలుసుకున్న అన్నదమ్ముల కుటుంబాల ఆనందం.. తెల్లవారేలోపే ఆవిరైపోయింది. అగ్ని ప్రమాదం ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చింది. ఎనిమిది మంది చిన్నారులు, నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. హైదరాబాద్  పాతబస్తీలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు సజీవ దహనం కాగా, పొగతో ఊపిరాడక మరో14 మంది ప్రాణాలు విడిచారు. 

హైదరాబాద్‌, వెలుగు: హైదరాబాద్​లోని ఓల్డ్​సిటీలో భారీ అగ్ని ప్రమా దం జరిగింది. చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్‌ చౌరస్తాలో గల ఓ బిల్డింగ్​లో ఆదివారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. జీ ప్లస్​2 బిల్డింగ్​లోని మొదటి అంతస్తులో వీరు నిద్రిస్తుండగా, షార్ట్​సర్క్యూట్​తో మూడు ఏసీ కంప్రెషర్లు​పేలి మంటలు అంటుకున్నాయి. బయటకు వెళ్లేందుకు దారి లేక.. పొగతో ఊపిరాడక స్పాట్​లోనే ఎనిమిది మంది చనిపోయారు. మరో 9 మంది ఆస్పత్రుల్లో  చికిత్స పొందుతూ కన్నుమూశారు. ప్రమాద విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, స్థానికులు హుటాహుటిన రంగంలోకి దిగి.. తొమ్మిది మందిని కాపాడారు. ప్రమాద సమయంలో  బిల్డింగ్​ లోపల దాదాపు 30 మంది ఉన్నారు. గాయపడ్డవాళ్లను ఉస్మానియా, డీఆర్‌‌డీవో అపోలో, మలక్‌పేట యశోద హాస్పిటల్స్​కు తరలించారు. ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం మృతులకు రూ.2 లక్షల చొప్పున, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌‌‌‌గ్రేషియా ప్రకటించాయి.
 
50 ఏండ్ల కింద బెంగాల్​ నుంచి వచ్చి..!

పశ్చిమబెంగాల్‌‌‌‌కు చెందిన ప్రహ్లాద్‌‌‌‌ మోదీ(70), రాజేందర్ మోదీ(65) సోదరుల కుటుంబాలు 50 ఏండ్లుగా చార్మినార్​ దగ్గర ఉన్న గుల్జార్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌ ఏరి యాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జ్యువెలరీ వ్యాపారం నిర్వహిస్తున్నాయి. ఈ రెండు కుటుంబాలకు చెందిన పంకజ్ మోదీ (36), అభిషేక్‌‌‌‌ (31) చంద్రాయణగుట్ట, ఉప్పరపల్లి గౌతంనగర్​లో నివాసముంటున్నారు. వీళ్లంతా గుల్జార్ హౌస్‌‌‌‌ చౌరస్తాలోని జీ ప్లస్ 2 బిల్డింగ్‌‌‌‌లో కృష్ణ పెరల్స్‌‌‌‌, మోదీ జ్యువెలర్స్ పేరుతో జ్యువెలరీ షాపులు నిర్వహిస్తున్నారు. అదే బిల్డింగ్‌‌‌‌లో ఇక్రమ్‌‌‌‌ పేరుతో మరో జ్యువెలరీ షాపు ఉంది. గ్రౌండ్ ​ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో షాపులుండగా.. ఫస్ట్​ ఫ్లోర్‌‌‌‌, బిల్డింగ్‌‌‌‌ వెనుక భాగం‌‌‌‌లో ప్రహ్లాద్‌‌‌‌ మోదీ కుటుంబసభ్యులు నివాసం ఉంటున్నారు. ఇదే బిల్డింగ్‌‌‌‌లోని సెకండ్ ఫ్లోర్‌‌‌‌‌‌‌‌లో వర్కర్లు ఉంటున్నారు. షాపులోకి అవసరమైన జ్యువెలరీ ఇక్కడే తయారు చేస్తుంటారు. 

గెట్‌‌‌‌ టు గెదర్ కోసం కలుసుకొని..!

శనివారం ప్రహ్లాద్‌‌‌‌ మోదీ, రాజేందర్‌‌‌‌‌‌‌‌ మోదీ సోదరుల కుటుంబాలు గెట్‌‌‌‌ టు గెదర్‌‌‌‌‌‌‌‌ కోసం గుల్జార్​హౌస్ ఏరియాలోని ఇంట్లో కలిశాయి. ఈ గెట్​టు గెదర్​ కోసం చాంద్రాయణగుట్ట, ఉప్పర్‌‌‌‌‌‌‌‌పల్లి గౌతంనగర్‌‌‌‌ నుంచి రెండు ఫ్యామిలీలు వచ్చాయి. పిల్లలు, పెద్దలు కలిపి సుమారు 30 మంది సెలబ్రేట్​ చేసుకున్నారు. రాత్రి డిన్నర్ ​తర్వాత గుల్జార్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌లోని ప్రహ్లాద్‌‌‌‌ నివాసంలోని మొదటి అంతస్తులో గల పెద్ద హాల్‌‌‌‌లో కొంత మంది, రెండు కిచెన్ల పక్కన ఉన్న బెడ్‌‌‌‌ రూముల్లో 8 మంది నిద్రపోయారు. ఆదివారం తెల్లవారుజామున అందరూ నిద్రలో ఉండగా 6.10 గంటలకు ఓ రూమ్‌‌‌‌లో షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ జరిగింది. దీంతో అక్కడే ఉన్న ఓ ఏసీలోని కంప్రెషర్ బ్లాస్ట్‌‌‌‌ అయింది. ఈ క్రమంలోనే షార్ట్‌‌‌‌ సర్క్యూట్ కారణంగా మరో రెండు రూముల్లో ఉన్న ఏసీలకు కూడా మంటలు వ్యాపించాయి. బిల్డింగ్‌‌‌‌ పైభాగం చెక్క, థర్మకోల్‌‌‌‌తో ఇంటీరియల్‌‌‌‌ డిజైన్‌‌‌‌ చేశారు. వీటితో పాటు ఇంట్లో చాలా ప్లాస్టిక్‌‌‌‌, ఎలక్ట్రానిక్‌‌‌‌ వస్తువులున్నాయి. ఏసీ వైర్ల నుంచి ఇంట్లోని మొత్తం వైరింగ్‌‌‌‌ ద్వారా మంటలు నిమిషాల వ్యవధిలో ఫ్లోర్​ అంతటికీ వ్యాపించాయి.

 అక్కడే ఉన్న చెక్క, ప్లాస్టిక్‌‌‌‌కు మంటలు అంటుకోవడంతో పొగ కమ్ముకుపోయింది. బిల్డింగ్‌‌‌‌ మొత్తానికి టన్నెల్‌‌‌‌ తరహాలో ఒక్కటే ఎగ్జిట్‌‌‌‌, ఎంట్రీ ఉంది. కొన్ని రూములకు లోపలి నుంచి గడియలు పెట్టి ఉన్నాయి. మంటలు వ్యాపించిన వెంటనే ఆయా రూముల్లో దట్టమైన పొగ కమ్ముకోవడంతో మంటల్లో చిక్కుకున్నారు. బయటకు వెళ్లేందుకు దారి తెలియక హాహాకారాలు చేశారు. కొందరు ప్రాణాలు కాపాడుకునేందుకు టెర్రస్‌‌‌‌ పైకి వెళ్లే ప్రయత్నం చేశారు. కానీ, టెర్రస్‌‌‌‌కు తాళాలు వేసి ఉండడంతో మంటల నుంచి తప్పించుకోలేకపోయారు. ఇలా ముగ్గురు మంటల్లో కాలిపోగా.. మరో ఐదుగురు ఊపిరాడక స్పాట్‌‌‌‌లోనే కన్నుమూశారు. అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఎనిమిది మంది చిన్నారులు హాస్పిటల్‌‌‌‌లో మృతి చెందారు.  

కిచెన్​ రంధ్రం నుంచి ముగ్గుర్ని కాపాడిన ఫైర్​ సిబ్బంది

అగ్ని ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు చార్మినార్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పాటు ఫైర్ సర్వీసెస్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కి కాల్‌‌‌‌ చేశారు. ఉదయం 6.16 గంటలకు అగ్నిమాపక శాఖకు ఫైర్ కాల్‌‌‌‌ వెళ్లగా.. 6.30 ప్రాంతంలో  మొఘల్‌‌‌‌పుర్‌‌‌‌‌‌‌‌ ఫైర్ స్టేషన్‌‌‌‌కు చెందిన ఫైర్ ఇంజిన్‌‌‌‌ స్పాట్‌‌‌‌కు చేరుకుంది. అప్పటికే దట్టమైన పొగలు వ్యాపించడంతో లోపలికి వెళ్లేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. మంటలు అదుపులోకి రాకపోవడంతో పరిసర ప్రాంతాల్లోని మరో 10 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలికి చేరుకున్నాయి. ఫైర్ సేఫ్టీ పరికరాలతో పాటు ఆక్సిజన్​కిట్లతో రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌ చేశారు. కిచెన్​కు ఉన్న రంధ్రంలోంచి ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు.  ఘటనా స్థలానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క,  కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, డీజీపీ జితేందర్, సీపీ సీవీ ఆనంద్‌‌‌‌, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి చేరుకొని పరిస్థితిని పర్యవేక్షించారు. 

షార్ట్​సర్క్యూట్​ వల్లే..

షార్ట్‌‌‌‌ సర్క్యూట్‌‌‌‌ వల్లే అగ్నిప్రమాదం జరిగింది. ఏసీ కంప్రెషర్ పేలుడు వల్ల ప్రమాద తీవ్రత పెరిగింది. ఇంట్లో చెక్కలతో చేసిన ప్యానెల్స్​ఎక్కువగా ఉన్నాయి. చెక్క కావడంతో తక్కువ సమయంలోనే భారీగా మంటలు వ్యాపించాయి.  

11 ఫైర్ ఇంజిన్లు, 70 మంది ఫైర్ సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్ చేశాం. ఎగ్జిట్, ఎంట్రీ ఒక్కటే కావడంతో రెస్క్యూ ఆపరేషన్‌‌‌‌లో సమస్యలు తలెత్తాయి. మంటల్లో చిక్కుకున్న వారు కూడా ప్రాణాలు కాపాడుకోలే పోయారు. ఈ బిల్డింగ్‌‌‌‌లో ఎలాంటి ఫైర్ సేఫ్టీ లేదు.- నాగిరెడ్డి, డీజీ ఫైర్ సర్వీసెస్‌‌‌‌ 

లోపలికి వెళ్లే సరికే..!

నమాజ్​కు వెళ్లి తిరిగి వస్తుండగా.. గుల్జార్​ హౌస్ ​దగ్గర బిల్డింగ్​ నుంచి ఇద్దరు మహిళలు ‘కాపాడండి’ అంటూ అరిచారు. అది విని మేం లోపలికి వెళ్లాం. ఆ రూమ్​ అంతా పొగతో నిండిపోయింది. అప్పటికే ఏసీ పేలిపోయి ఉంది. ఒక రూమ్​లో ఏడుగురు నిర్జీవంగా పడిపోయి ఉండడాన్ని చూశాం. 
ఒక వృద్ధురాలు ఫోన్ ​పట్టుకుని అలానే చనిపోయింది. గాయపడ్డ మిగతా వారిని దుప్పట్లు ఉపయోగించి బయటకు తెచ్చాం. 
– మహ్మద్​ జాహెద్, అతడి స్నేహితులు

ప్రహ్లాద్ మోదీ (70),
ఆయన భార్య మున్నీ(70).
రాజేందర్ మోదీ(65),
ఆయన భార్య సుమిత్ర (60).
అభిషేక్(31), శీతల్‌‌‌‌(35), 
వర్ష (35), పంకజ్‌‌‌‌ (36), హమీ(7),  ప్రయాన్షి అగర్వాల్​(4),
ఇరాజ్ (2), ఆరుషి (3), రిషభ్(4), ప్రతమ్ (ఏడాదిన్నర),
అనుయన్ (3), రజిని (32), ఇద్దు(4)

గవర్నర్ ​జిష్ణు దేవ్ సంతాపం

గుల్జార్ హౌస్ ఘటనపై గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ సంతాపం వ్యక్తం చేశారు. మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలిపారు. ఈ ఘటన తనను తీవ్రంగా కలిచి వేసిందని ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. గాయపడిన వాళ్లు త్వరగా కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. గాయపడిన వారికి మంచి ట్రీట్​మెంట్ అందించాలని అధికారులను ఆదేశించారు. 

17 మంది మృతి దురదృష్టకరం: మహేశ్​గౌడ్

గుల్జార్ హౌస్ ఘటనలో 17 మంది మృత్యువాత పడడం అత్యంత దురదృష్టకరమని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. ఘటనకు సంబంధించి హైదరాబాద్ నాయకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలలో పాల్గొనాలని స్థానిక నాయకులకు ఆయన సూచించారు. 

గుల్జార్ హౌస్ ఘటన బాధాకరం: ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం

గుల్జార్ హౌస్ ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంతాపం తెలిపారు. అగ్నిప్రమాద ఘటన తీవ్ర బాధాకరమని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారికి సంతాపం తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని వారు ఆకాంక్షించారు.