టీఎస్​పీఎస్సీ నిర్వహించాల్సిన పరీక్షలన్నీ రీషెడ్యూల్

టీఎస్​పీఎస్సీ నిర్వహించాల్సిన పరీక్షలన్నీ రీషెడ్యూల్

హైదరాబాద్, వెలుగు: టీఎస్​పీఎస్సీ నిర్వహించాల్సిన పరీక్షలన్నీ రీషెడ్యూల్ కానున్నాయి. పేపర్ లీకేజీ వ్యవహారంలో కమిషన్లో పనిచేస్తున్న చాలామంది ఉద్యోగులకు లింకులు ఉండటం.. ఇప్పటికే 4 పరీక్షలు రద్దు కావడంతో పాటు నిర్వహించాల్సిన 2 పరీక్షలను వాయిదా వేయడంతో టీఎస్​పీఎస్సీ నుంచి మరో రెండు నెలల దాకా ఎగ్జామ్స్ పెట్టే అవకాశం లేదని తెలిసింది. అసెంబ్లీలో 80 వేల ఉద్యోగాల ఖాళీలకు సంబంధించి సీఎం కేసీఆర్ ప్రకటన చేసి ఏడాది అవుతున్నా.. టీఎస్​పీఎస్సీ నుంచి ఒక్క పోస్టు కూడా ఇంతవరకు భర్తీకాలేదు. ఉద్యోగ ప్రకటన చేసినప్పుడు ఏడాది.. ఏడాదిన్నర లోపే ఈ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తమని ప్రకటించినప్పటికీ..  ప్రభుత్వ తీరుతో నిరుద్యోగుల భవిష్యత్తు గందరగోళంలో పడింది. పైగా ఇప్పుడు లీకేజీ వ్యవహారం పెద్ద స్థాయిలో ఉండటం.. డొంకంతా టీఎస్​పీఎస్సీ చుట్టూనే తిరుగుతుండటంతో జరగాల్సిన పరీక్షలన్నీంటిని రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ లీకేజీ ప్రభావం గ్రూప్ 2, 3, 4 పరీక్షలపైనా పడింది. మొత్తం గ్రూప్స్ పరీక్షలకు సంబంధించి దాదాపు 11 వేల పోస్టులు ఉన్నాయి. ఇందులో రద్దు చేసిన గ్రూప్1 ఎగ్జామ్ ను జూన్11న పెడతామని ప్రకటించారు. మిగిలిన వాటికి జులై, ఆగస్టులో అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారడంతో అన్ని తేదీలు మార్చే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఎగ్జామ్స్ తొందరగా పెట్టే ప్రయత్నం చేస్తే నిరుద్యోగుల్లో నమ్మకం ఉండదని.. ఇంకింత వ్యతిరేకత వచ్చే చాన్స్ ఉందని కమిషన్ భావిస్తోంది. పైగా టీఎస్​పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్​సెక్షన్ మొత్తం లీకేజీ కేసులో ఉండటంతో ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకుని సిట్ విచారిస్తోంది. దీంతో వాళ్లు చేయాల్సిన వర్క్ అంతా పెండింగ్​లో పడింది. మరోవైపు కమిషన్​లో ఆయా బాధ్యతలను చూస్తున్న వారిని కూడా మార్చారు. అలాగే క్వశ్చన్ పేపర్ల తయారీ, సెక్యూర్​గా తరలించడం, పరీక్షలను సజావుగా నిర్వహించడం వంటివి పకడ్బందీగా పూర్తిచేయాల్సి ఉండటంతో సిట్ ఎంక్వైరీ పూర్తయ్యే వరకు ఏ నిర్ణయమూ తీసుకోకూడదని కమిషన్ యోచిస్తోంది. దీంతో పరీక్షల నిర్వహణ ఎప్పుడనేది సందిగ్ధంగా మారింది.  

సిట్ రిపోర్ట్ తర్వాతే స్పష్టత 

రద్దుచేసిన, వాయిదా వేసిన, రీషెడ్యూల్ చేసే పరీక్షలు నిర్వహించే తేదీలను సిట్ రిపోర్ట్ తర్వాతే టీఎస్​పీఎస్సీ ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఏదైనా పోటీ పరీక్షకు నెల, రెండు నెలల ముందుగా ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాల్సి ఉంటుంది. దీంతో రద్దయిన, రీషెడ్యూల్ చేసే ఎగ్జామ్స్ అన్నింటికీ ప్రశ్నపత్రాలను సిద్ధం చేయడానికి సమయం పట్టనుంది. ఇప్పటికే గ్రూప్- 2, 4 పరీక్షల తేదీలను కమిషన్ ప్రకటించింది. వీటిని రీషెడ్యూల్ చేయనున్నారు. జులై 1న గ్రూప్-4, ఆగస్టు చివరలో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ తేదీలు మారే అవకాశం ఉందని చెప్తున్నారు.  గ్రూప్​–3 విషయంలోనూ ఎప్పుడు పెట్టాలనేదానిపై ఆలోచన చేస్తున్నారు. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఇక నాలుగు నెలల్లో కంప్లీట్​గా ఎలక్షన్ మోడ్​లోకి వెళ్తుంది. ఆ టైంలో పరీక్షలు జరుగుతాయా? లేదా మళ్లీ కొత్త గవర్నమెంట్ వచ్చే వరకు ఆగాల్సి ఉంటుందా? అనే దానిపై అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. 

వాటినీ రద్దు చేస్తే అన్నీ పోయినట్లే 

రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఆర్థిక శాఖ ద్వారా 65 వేల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చింది. ఇందులో టీఎస్​పీఎస్సీ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 33 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతులు వచ్చాయి. వీటిలో 26 నోటిఫికేషన్లు జారీ చేశారు. ఇందులో టీఎస్ పీఎస్సీ ఇప్పటికే గ్రూప్1 ప్రిలిమ్స్, డీఏవో, ఏఈ, ఏఈఈ, సీడీపీవో, ఎక్స్​టెన్షన్​ ఆఫీసర్, ఫుడ్ సేప్టీ ఆఫీసర్ పరీక్షలను నిర్వహించింది. లీకేజీ వ్యవహారంతో వీటిలో నాలుగు ఎగ్జామ్స్​ రద్దు చేశారు. ఇంకో మూడు పరీక్షలనూ రద్దు చేయాలన్న డిమాండ్స్ వస్తున్నాయి. ఇప్పుడు వీటిని కూడా రద్దు చేస్తే టీఎస్​పీఎస్సీ మొదలుపెట్టిన ఎగ్జామ్స్ అన్నీ దాదాపుగా పోయినట్లే. ఇక జరగాల్సిన రెండు పరీక్షలు వాయిదా పడ్డాయి. దీంతో మళ్లీ ఫ్రెష్​గా అన్నింటికి షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరో వైపు సిట్ ఎంక్వైరీ పూర్తయి, రిపోర్ట్ వచ్చాకే.. పరీక్షల నిర్వహణపై దృష్టి సారిం చనున్నారు. ఇందుకు కనీసం ఇంకా ఒక నెల టైం పడుతుందని ఆఫీసర్లు అంటు న్నారు. ఆ తర్వాత జాతీయ స్థాయి పరీక్ష లు, మిగతావన్నీ చూసుకుని రాష్ట్రంలో నిర్వహించాల్సిన పరీక్షల తేదీలపై ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.