ప్రాజెక్టులు వెలవెల.. శ్రీశైలంలో 33.62 టీఎంసీలు, సాగర్​లో 148 టీఎంసీలు

ప్రాజెక్టులు వెలవెల.. శ్రీశైలంలో 33.62 టీఎంసీలు, సాగర్​లో 148 టీఎంసీలు
  • శ్రీశైలంలో 33.62 టీఎంసీలు, సాగర్​లో 148 టీఎంసీలు

హైదరాబాద్, వెలుగు:  వానాకాలం ఎంటరై నెలన్నర అయిపోతున్నది.. అయినా ఇప్పటికీ రాష్ట్రంలో వాన జాడ లేదు. దీంతో ఈ పాటికి కళకళలాడాల్సిన కృష్ణా, గోదావరి బేసిన్‌‌లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ వెలవెలబోతున్నాయి. వానలు పడక, వరదలు రాక బోసిపోయి కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఒక్క ప్రాణహిత తప్ప ఎక్కడా ఇన్‌‌ఫ్లో లేదు. గతేడాదితో పోలిస్తే అన్ని ప్రాజెక్టుల్లోనూ ఇప్పుడు నీళ్ల స్టోరేజీ చాలా తక్కువగా ఉంది. దీంతో ఆయా ప్రాజెక్టుల నుంచి ఇప్పుడే సాగునీటిని అందించే పరిస్థితి కనిపించడం లేదు. మరో నెల సమయం పట్టే అవకాశం ఉంది. తాగునీటి కోసం సాగర్ ప్రాజెక్టు నుంచి 6 వేల క్యూసెక్కుల నీటిని పాలేరు జలాశయానికి తరలించనున్నారు.

సోమవారం నీటిని విడుదల చేయాల్సి ఉన్నా.. పాలేరు రిజర్వాయర్‌‌‌‌కు గండి పడడంతో దాన్ని మంగళవారానికి వాయిదా వేశారు. నిరుడు శ్రీశైలంలో ఇదే సమయానికి 43.82 టీఎంసీల నీళ్లుండగా.. ప్రస్తుతం 33.62 టీఎంసీలే ఉన్నాయి. సాగర్‌‌‌‌లో పోయినేడాది ఈ టైమ్‌‌కు 166 టీఎంసీల మేర నీళ్లు నిల్వ ఉండగా.. ఇప్పుడు 148 టీఎంసీలున్నాయి. కర్నాటకలోని ప్రధాన ప్రాజెక్టులైన ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలకు వరద రావడం లేదు. దీంతో వాటిలోనూ స్టోరేజీ తక్కువగానే ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు దాదాపు ఎండిపోయే స్థితికి వచ్చింది. ఆ ప్రాజెక్టు అసలు సామర్థ్యం 105.79 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం కేవలం 3 టీఎంసీల నేళ్లే ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి 64.73 టీఎంసీల జలాలు ఉండడం గమనార్హం.

రెండ్రోజులు మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో రెండు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో పలు జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది. ఆదివారం జనగామ, నల్గొండ, సిద్దిపేట, సంగారెడ్డి, సూర్యాపేట, సిరిసిల్ల, నాగర్​కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి. ఈ నెలలో ఇప్పటిదాకా రాష్ట్రవ్యా ప్తంగా 28 శాతం లోటు వర్షపాతం రికార్డయింది. అత్యధికంగా ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో 50 శాతానికిపైగా వర్షపాత లోటు నమోదైంది.