ఐబొమ్మ బ్లాకైనా ఆగని పైరసీ దందా.. శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ ఒక్క రోజులోనే మూవీ రూల్జ్‎లో ప్రత్యక్షం

ఐబొమ్మ బ్లాకైనా ఆగని పైరసీ దందా.. శుక్రవారం రిలీజైన సినిమాలన్నీ ఒక్క రోజులోనే మూవీ రూల్జ్‎లో ప్రత్యక్షం

హైదరాబాద్: మూవీ పైరసీ వెబ్‎సైట్ ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.. ఐబొమ్మ, బప్పం సైట్లను బ్లాక్ చేశారు. అయినప్పటికీ మూవీ పైరసీ దందా మాత్రం ఆగడం లేదు. మూడు పువ్వులు ఆరుకాయలు అన్నట్లుగా యధేచ్చగా పైరసీ దందా కొనసాగుతోంది. ఐబొమ్మ, బప్పం వెబ్ సైట్లను బ్లాక్ చేసినప్పటికీ వేరే పైరసీ ‎సైట్లలో ఎప్పటిలాగే కొత్త సినిమాలు ప్రత్యక్షం అవుతున్నాయి. 

ఐబొమ్మ కంటే ముందు నుంచే సినిమాలను పైరసీ చేస్తోన్న మూవీరూల్జ్ పైరసీ దందాను యధావిధిగా కంటిన్యూ చేస్తోంది. 2025, నవంబర్ 21వ తేదీ శుక్రవారం విడుదలైన కొత్త సినిమాలన్నీ కేవలం ఒక్కరోజులోనే మూవీరూల్జ్ సైట్లో ప్రత్యక్షం కావడం కలకలం రేపుతోంది. శుక్రవారం (నవంబర్ 21) రిలీజైన అల్లరి నరేశ్ నటించిన 12ఏ రైల్వే కాలనీ సినిమా, సంతాన ప్రాప్తిరస్తు, రాజు వెడ్స్‌ రాంబాయి, ప్రేమంటే సినిమాలను థియేటర్ నుంచి క్యాం కార్డర్ ద్వారా రికార్డ్ చేసి మూవీరూల్జ్‎లో అప్‎లోడ్ చేశారు.

 ఒకవైపు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి పైరసీపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తుంటే.. మరోవైపు కొత్త సినిమాలన్నింటినీ పైరసీ చేసి మూవీరూల్జ్‎ నిర్వాహకులు పోలీసులకు సవాల్ విసరడం సంచలనంగా మారింది. విడుదలైన ఒక్కరోజులోనే సినిమాలు పైరసీ కావడంతో నిర్మాతలు తలలు పట్టుకుంటున్నారు. మరీ ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టిన పోలీసులు.. మూవీరూల్జ్ నిర్వాహకులపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.