హైదరాబాద్‎లో చెరువులన్నీ నిండినయ్.. 2023 సీన్ రిపీట్ కాకుండా GHMC అలర్ట్

 హైదరాబాద్‎లో చెరువులన్నీ నిండినయ్.. 2023 సీన్ రిపీట్ కాకుండా GHMC అలర్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: భారీ వర్షాలకు గ్రేటర్ చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. వర్షాలకు నిండుకుండల్లా మారిన చెరువులపై బల్దియా 24 గంటల పాటు మానిటరింగ్ చేస్తున్నది. గతంలో చెరువులు నిండి కాలనీలు, బస్తీలు నీట మునగడంతో ఆ పరిస్థితి పునరావృతం కాకుండా యాక్షన్‎లోకి దిగారు. గ్రేటర్ లోని 185 చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు ప్రత్యేకంగా 18 మంది అధికారులకు బాధ్యతలు అప్పగించారు. 

ఎఫ్టీఎల్​మించి పోయాయ్​

నగరం నడిబొడ్డున ఉండే హుస్సేన్ సాగర్‎తో పాటు సరూర్ నగర్, ఫాక్స్ సాగర్, మల్కం చెరువులతో పాటు పలు చెరువులు ఇప్పటికే ఎఫ్టీఎల్ మించిపోయాయి. వీటితో పాటు ఇంకొన్ని చెరువులు ఎఫ్టీఎల్‎కి రెండు, మూడు అడుగులు మాత్రమే తక్కువగా ఉంది. అతిభారీ వర్షాలు కురిస్తే దాదాపు 40 చెరువులు నిండే అవకాశం ఉంది. అయితే, 2020, 23లో సంఘటలను దృష్టిలో పెట్టుకొని అధికారులు ముందస్తుగా అలెర్ట్ అయ్యారు.  

అప్పుడేం జరిగిందంటే..

2020, 2023లో అనేక చెరువులు నిండి ఉప్పొంగాయి. కొన్ని చెరువుల కట్టలు తెగి కాలనీల్లోకి నీరు చేరింది. బ్యాక్ వాటర్‎తో మరికొన్ని కాలనీలు నీట మునిగాయి. సూరారం పెద్ద చెరువు పూర్తిగా నిండి పొంగిపోవడంతో వోక్షిత్ కాలనీ నీట మునిగింది. బండ్లగూడ చెరువు, నాగోల్ చెరువు, హయత్ నగర్‎లోని బాతుల చెరువు, కుమ్మరి కుంట, మన్సూరాబాద్​పెద్ద చెరువు, కుత్బుల్లాపూర్‎లోని ఫాక్స్ సాగర్, గాజుల రామారం పర్కి చెరువులు ఫుల్లయ్యాయి.  ఇలా 50 చెరువులు ఫుల్ ట్యాంక్ లెవెల్​కి చేరాయి.  

రెండు ఫీట్లు తక్కువ ఉండేలా.. 

ప్రస్తుతం చెరువుల్లో ఫుల్ ట్యాంక్ లెవెల్‎కి రెండు ఫీట్లు తక్కువగా నీటిని మెయింటెన్ చేయాలని బల్దియా నిర్ణయించింది.  ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడితే ప్రతి చెరువు వద్ద మోటార్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీటి లెవెల్​ను మెయింటెయిన్​చేయాలని చూస్తున్నారు. 

హుస్సేన్​సాగర్​ 513.30 మీటర్లు 


హుస్సేన్ సాగర్‎కు వరద కొనసాగుతూనే ఉంది. బంజారా, పికెట్, కూకట్ పల్లి, బుల్కాపూర్ నాలాల నుంచి హుస్సేన్ సాగర్‎లోకి  వరద వస్తోంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ (ఎఫ్టీఎల్)513.41 మీటర్లు కాగా, ప్రస్తుత నీటిమట్టం 513.30 మీటర్లు ఉంది. జీహెచ్ఎంసీ లేక్స్ విభాగం ఎఫ్టీఎల్ దాటకుండా వాటర్ లెవెల్‎ను మెయింటెయిన్​చేస్తోంది. తూముల ద్వారా నీటిని మూసీలోకి వదులుతున్నారు. గురువారం సాయంత్రానికి 305 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 820  క్యూసెక్కుల ఔట్ ఫ్లో కొనసాగుతోంది.

జల్ పల్లి చెరువును పరిశీలించిన కమిషనర్ 

 రాజేంద్ర నగర్ సర్కిల్ లో  జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డితో కలిసి జీహెచ్​ఎంసీ కర్ణన్ ​పర్యటించారు. జల్ పల్లి చెరువుతో పాటు వరదముప్పున్న ప్రాంతాలు, లోతట్టు ఏరియాలను కమిషనర్ పరిశీలించారు. వరద నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటిని తొలగించాలని, వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.