మంత్రాల అనుమానంతో గ్రామస్థుల మూకుమ్మడి ప్రమాణాలు!

మంత్రాల అనుమానంతో గ్రామస్థుల మూకుమ్మడి ప్రమాణాలు!

పినపాక, వెలుగు: మూఢనమ్మకాలతో సాటివారినే  అనుమానిస్తూ మంత్రాలు, చేతబడులు, బాణామతి వంటి క్షుద్రవిద్యలు ఉన్నాయనే భయంతో మూకుమ్మడిగా గ్రామస్తులంతా దేవరబాలను ఆశ్రయించిన వైనం ఆలస్యంగా వెలుగుచూసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని అమరవరం గ్రామంలో ఇటీవల కొందరు చనిపోయారు. మరికొందరు అస్వస్థతకు గురయ్యారు. ఇదంతా అతీత శక్తుల వల్లే జరుగుతోందనే  భయం గ్రామస్తుల్లో తలెత్తింది. అప్పటివరకు వివిధ వరుసలతో పిలుచుకుంటూ స్నేహపూర్వకంగా గడిపిన వారిమధ్య లేనిపోని అపోహలు చోటుచేసుకున్నాయి. సుమారు నెలరోజులుగా గ్రామంలో తెలియని అశాంతి నెలకొంది. దశాబ్దం క్రితం ఇదే గ్రామంలో మంత్రాల నెపంతో ఓ హత్య జరిగింది. ఈ నేపథ్యంలో గ్రామపెద్దలు సమావేశమై ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకముందే ఈ అశాంతి నివారణకు పరిష్కారం వెతికేందుకు సమాలోచనలు జరిపారు. ముందుగా మంత్రాలు, క్షుద్రవిద్యలు తెలిసినవారు ఎవరైనా ఉంటే వారి తప్పును బహిరంగంగా ఒప్పుకోవాలని తీర్మానించారు. ఎవరూ ముందుకు రాకపోవడంతో దీనికి ప్రత్యామ్నాయంగా గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరూ ప్రమాణం చేయడం ద్వారా నిజాయతీని నిరూపించుకోవాలనే అంగీకారానికి వచ్చారు. ఇందుకు వేదికగా కరకగూడెం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న గిరిజనుల ఆరాధ్యదేవత సారలమ్మ గద్దెలను, అక్కడ పూజలు నిర్వహించే దేవరబాలను ఎంచుకున్నారు. ఈ నెల 11న 30 బైకులు, పది ట్రాక్టర్లు, పలు ఆటోల్లో పిల్లాపాపలతో బయలుదేరి 30 కి.మీ. దూరంలో ఉన్న సారలమ్మ గద్దెల వద్దకు వెళ్లారు.

దీపంపై ప్రమాణాలు

వీరి సమస్యను విన్న దేవరబాల అందరూ వారికి మంత్రాలు రావని గద్దెల వద్ద ఉన్న దీపంపై ప్రమాణం చేయాలని సూచించారు. ఎవరైనా తప్పుడు ప్రమాణం చేస్తే మూడు నెలల్లో వారికి కీడు జరుగుతుందని ఆయన హెచ్చరించినట్లు తెలుస్తోంది. అక్కడికి వెళ్లినవారంతా ఒక్కొక్కరుగా దీపంపై ప్రమాణాలు చేశారు. ప్రమాణాలు చేసే సమయంలో కొంతమంది  దిష్టి, తేలు, పాము, పశువులకు వచ్చే దొమ్మల వ్యాధి నివారణ మంత్రాలు వంటివి మాత్రమే వచ్చని ప్రమాణాలు చేయడం గమనార్హం. చేతబడులు, బాణామతుల వంటి సాటివారికి హాని చేసే తంత్రాలు తమకు ఎంతమాత్రం తెలియదని అందరూ ప్రమాణం చేశారు. అనంతరం సారలమ్మ దేవతకు మొక్కులు చెల్లించుకుని తిరిగి గ్రామానికి చేరుకున్నారు. మంత్రాలు, చేతబడుల నెపంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గ్రామంలో ముందస్తుగా అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేస్తే మంచిదని పలువురు అభిప్రాయపడుతున్నారు.