ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు ప్రదానం

ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాలు ప్రదానం

హైదరాబాద్,వెలుగు:  గతేడాది నుంచి డిగ్రీ స్థాయి విద్యార్థులకు మూడేండ్లు తెలుగు పాఠాలు బోధిస్తున్నామని ఉన్నత విద్యామండలి చైర్మన్  ఆర్.లింబాద్రి తెలిపారు. గురువారం నాంపల్లిలోని  తెలుగు యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో వెలువడిన ఉత్తమ  గ్రంథాలకు సాహితీ పురస్కారాల ప్రదాన కార్యక్రమం జరిగింది. చీఫ్ గెస్టుగా హాజరైన లింబాద్రి మాట్లాడుతూ... తెలుగు సాహిత్యం ద్వారా నిబద్ధతతో సమాజాన్ని జాగృత పరుస్తున్న రచయితలను గుర్తించి సత్కరించడం గొప్ప విషయమన్నారు. వీసీ కిషన్​రావు మాట్లాడుతూ... వర్సిటీలో ఈ విద్యాసంవత్సరం కొత్తగా 20 కోర్సులను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. రెండు నెలల్లో బాచుపల్లి క్యాంపస్​కు వర్సిటీని తరలిస్తామన్నారు. సాహితీ పురస్కారం అందుకున్న వారిలో ఆంధ్రజ్యోతి ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారావు(ఆకాశం కోల్పోయిన పక్షి) ఉన్నారు.  కార్యక్రమంలో సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి,  తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ భట్టు రమేశ్  తదితరులు పాల్గొన్నారు.