ఏనుమాముల మార్కెట్​లో పత్తికి ఆల్‍ టైం రికార్డ్ ధర

ఏనుమాముల మార్కెట్​లో పత్తికి ఆల్‍ టైం రికార్డ్ ధర
  • ఏనుమాముల మార్కెట్​లో  ఆల్‍ టైం రికార్డ్ ధరలు 

వరంగల్‍, కాశిబుగ్గ, వెలుగు : వరంగల్​ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​లో మిర్చి, పత్తికి మంగళవారం ఆల్‍ టైం రికార్డ్ ధరలు దక్కాయి. 50 వేలకు పైగా మిర్చి, పత్తి బస్తాలతో ఉదయం నుంచే యార్డ్ కళకళలాడింది. ఇందులో సింగిల్ ​పట్టి రకం మిర్చి క్వింటాల్‍కు రూ.40 వేలు, పత్తి క్వింటాల్‍కు రూ.10,100 పలికింది. దీంతో రాష్ట్రంలోనే తొలిసారి సరికొత్త రికార్డు నమోదైందని మార్కెటింగ్​ శాఖ జేడీఎం మల్లేశం, మార్కెట్ సెక్రెటరీ బివి.రాహుల్ తెలిపారు. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్​కు  యూఎస్‍–341, దేవునూర్‍ డిలక్స్ (డీడీ), 1048, తేజ, 334, వండర్‍ హాట్‍తో పాటు సింగిల్‍ పట్టి మిర్చిని రైతులు ఎక్కువగా తీసుకువస్తారు. ములుగు జిల్లా వెంకటాపూర్​కు చెందిన రైతు సుధాకర్‍రావు మంగళవారం సింగిల్‍పట్టి రకానికి చెందిన 11 బస్తాలు  తీసుకురాగా, రాజరాజేశ్వర చిల్లీస్​ ఖరీదుదారుడు క్వింటాల్‍కు రూ.40 వేల చొప్పున కొన్నాడు. మిగతా మిర్చి రకాలతో పోలిస్తే..సింగిల్ పట్టి రకానికి ఇంటర్నేషనల్‍ మార్కెట్‍ ఎక్కువగా ఉంది. ఘాటు తక్కువగా ఉండే ఈ మిర్చి , స్వీటుగా ఉండడంతో ప్రముఖ కంపెనీలు సాస్‍, స్వీట్లలో ఉపయోగిస్తాయి. అందుకే ఈ స్థాయి డిమాండ్​ ఉందని తెలుస్తోంది..  

పత్తికి రూ.10,100

పత్తికి ప్రభుత్వ మద్దతు ధర క్వింటాల్​కు రూ.6,025 ఉండగా, ఈ ఏడాది సీజన్​ నుంచి పెరుగుతూ వస్తోంది.​ మొదట్లో రూ.8 వేలుండగా, మంగళవారం ఏనుమామూల మార్కెట్​లో అత్యధికంగా రూ.10.100   పలికింది. ఇది కూడా స్టేట్​ రికార్డు అని ఆఫీసర్లంటున్నారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఎలుకుర్తికి చెందిన రైతు తిరుపతి 17 బస్తాల పత్తి మార్కెట్​లోని జాజు ట్రేడర్స్​కు తీసుకురాగా, విశ్వనాథ్​ ట్రేడింగ్ కంపెనీ క్వింటాల్​కు రూ.10,100 చొప్పున కొనుగోలు చేసింది.