చరిత్ర సృష్టించిన మహిళా పోలీస్ టీమ్.. ఫస్ట్ టైమ్ ఎన్కౌంటర్లో మొత్తం మహిళలే..

చరిత్ర సృష్టించిన మహిళా పోలీస్ టీమ్.. ఫస్ట్ టైమ్ ఎన్కౌంటర్లో మొత్తం మహిళలే..

ఎన్ కౌంటర్ అంటే తెలిసే ఉంటుంది.. కనిపిస్తే కాల్చేయడం. ఎటు వైపు నుంచి ఏ బుల్లెట్ దూసుకొస్తుందో.. ఎవరు దాడి చేస్తారో.. ప్రాణాలకు తెగించి ఈ ఆపరేషన్ లో పాల్గొనాలి. ప్రత్యర్థులు జరిపే కాల్పుల నుంచి తప్పించుకుంటూ ఆపరేషన్ పూర్తి చేయాలి. ఇప్పటి వరకు ఎన్ కౌంటర్స్ అంటే మేల్ పోలీస్ ఆఫీసర్లే పాల్గొనేవారు. ఎందుకంటే రిస్క్ అంతగా ఉంటుంది కాబట్టి. కానీ.. ఇండియాలోనే ఫస్ట్ టైమ్.. ఒక ఎన్ కౌంటర్ ఆపరేషన్ మొత్తం మహిళా టీమ్ పూర్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని  ఘజియాబాద్‌లో ఆదివారం (సెప్టెంబర్ 21) రాత్రి పూర్తిగా మహిళా టీమ్ ఎన్ కౌంటర్ లో పాల్గొని.. అనేక దొంగతనాలు,  దోపిడీ కేసుల్లో నిందితుడిని పట్టుకోవడం హాట్ టాపిక్ గా నిలిచింది. 

మహిళా పోలీస్ టీమ్ జనరల్ చెకింగ్ చేస్తుండగా.. విజయ్ నగర్ నివాసి అయిన జితేంద్ర తప్పించుకునే ప్రయత్నం చేసి ఆపకుండా పారిపోవాలని చూశాడు. పోలీసులు జితేంద్రను లొంగిపోవాలని ఆదేశించగా.. తన గన్ తో కాల్పులకు దిగినట్లు పోలీసులు చెప్పారు. దీంతో పోలీస్ టీమ్ ఎన్ కౌంటర్ జరిపి.. నిందితుడిపై కాల్పులు జరిపారు. ప్రాణ నష్టం లేకుండా గాయపరిచి అదుపులోకి తీసుకున్నారు. 

జితేంద్ర చైన్ స్నాచింగ్, బైకులు, కార్ల దొంగతనాలకు పాల్పడేవాడని సీనియర్ పోలీసు అధికారి ఉపాసన పాండే తెలిపారు. అరెస్టు తర్వాత విచారణలో, ఢిల్లీ వ్యాప్తంగా బైకులు, కార్లు , మొబైల్ ఫోన్లు , ఇతర విలువైన వస్తువులను దొంగిలించినట్లు ఒప్పుకున్నాడుని చెప్పారు. పోలీసులు నిందితుడి నుంచి ఒక దేశీ పిస్టల్, ఇతర మారణాయుధాలతో పాటు.. బైక్, ఒక మొబైల్ ఫోన్ , ఒక టాబ్లెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

గన్ ఫైర్ చేస్తున్న దుండగుడిని ఎదిరించి ఎన్ కౌంటర్ కంప్లీట్ చేసిన మహిళా పోలీస్ టీమ్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. మహిళా పోలీసులంటే బందోబస్తులు, ఆఫీస్ వర్క్స్ కాదు.. పురుషులకు సమానంగా ఎన్ కౌంటర్లు కూడా చేయగలమని నిరూపించారని నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.