స్థానిక వస్తువులను కొనండి: మోడీ

 స్థానిక వస్తువులను కొనండి: మోడీ
  • ఉత్తరాఖండ్ పర్యటనలో ప్రధాని
  • కేదార్ నాథ్, హేమకుండ్ సాహిబ్ రోప్ వేలకు శంకుస్థాపన 
  • రూ.3,400 కోట్లతో అభివృద్ధి పనులు 

డెహ్రాడూన్: దేశంలోని టూరిస్ట్ ప్లేస్​లు, బార్డర్ ప్రాంతాలకు టూర్​లు వెళ్లినప్పుడు లోకల్ ప్రొడక్టులను కొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ట్రావెల్ బడ్జెట్​లో కనీసం 5% లోకల్ వస్తువులను కొనేందుకు కేటాయించాలని టూరిస్టులను కోరారు. ఇలాచేస్తే స్థానిక ప్రజల ఉపాధి పెరిగి లోకల్ ఎకానమీ బలోపేతం అవుతుందన్నారు. ప్రధాని మోడీ రెండు రోజుల పర్యటనకు శుక్రవారం ఉదయం ఉత్తరాఖండ్ వెళ్లారు.

ఎయిర్ పోర్టులో ఆయనకు ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్, సీఎం పుష్కర్ సింగ్ ధామి స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేదార్ నాథ్​కు చేరుకున్న మోడీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదిగురు శంకరాచార్య సమాధి స్థలాన్ని కూడా ప్రధాని సందర్శించారు. అనంతరం హెలికాప్టర్​లో బద్రీనాథ్ టెంపుల్​కు చేరుకుని పూజలు చేశారు. బద్రీనాథ్​కు సమీపంలోని చివరి ఇండియన్ విలేజ్ ‘మనా’ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు.

లోకల్ ఎకానమీని బలోపేతం చేసేందుకు ప్రజలంతా స్థానిక వస్తువులను కొంటూ ‘లోకల్ ఫర్ వోకల్’ కార్యక్రమానికి మద్దతు ఇవ్వాలన్నారు. చైనా బార్డర్​కు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న మనా గ్రామాన్ని లాస్ట్ ఇండియన్ విలేజ్ గా పిలుస్తుంటారు. అయితే, ఇది ఆఖరి గ్రామం కాదని.. మొదటి గ్రామమని మోడీ అన్నారు. ఇక్కడి నుంచే దేశ క్షేమం మొదలవుతుందన్నారు. 

పుణ్యక్షేత్రాలపై గత ప్రభుత్వాల నిర్లక్ష్యం

దేశవ్యాప్తంగా వివిధ మతాల విశ్వాసాలకు కేంద్రాలుగా ఉన్న పుణ్యక్షేత్రాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయని మోడీ అన్నారు. తాము వాటి కీర్తిని మళ్లీ చాటేలా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగానే కాశీ విశ్వనాథ్ టెంపుల్, ఉజ్జయిని, అయోధ్య వంటి చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. 

కేదార్ నాథ్ కు 45 లక్షల మంది వచ్చిన్రు

గతంలో సరైన సౌలతులు లేకపోవడంతో కేదార్ నాథ్​కు వెళ్లడం చాలా కష్టంగా ఉండేదని, ఇప్పుడు తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులతో భక్తుల రద్దీ భారీగా పెరిగిందని మోడీ అన్నారు. సాధారణంగా ఏటా ఒక  సీజన్​లో 4 నుంచి 5 లక్షల మంది కేదార్​నాథ్​ను సందర్శించేవారని, కానీ ఈ సీజన్​లో రికార్డ్ స్థాయిలో 45 లక్షల మంది సందర్శించారని చెప్పారు. 

రోప్ వేలకు, రోడ్లకు శంకుస్థాపన 

కేదార్ నాథ్ వద్ద 9.7 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసే గౌరీకుండ్-- కేదార్ నాథ్ రోప్ వే ప్రాజెక్టుకు, హేమకుండ్ సాహిబ్ గురుద్వారా రోప్ వేకు మోడీ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం గౌరీకుండ్ నుంచి కేదార్ నాథ్ కు వెళ్లేందుకు 6 నుంచి 7 గంటల సమయం పడుతోంది. రోప్ వే అందుబాటులోకి వస్తే 30 నిమిషాలలో చేరుకోవచ్చు. కేదార్ నాథ్, హేమకుండ్ సాహిబ్ వద్ద రోప్ వేలు, రోడ్ల అభివృద్ధి పనులకు మొత్తం రూ.3,400 కోట్లను కేటాయించారు.

రూ.1000 కోట్లతో చేపట్టిన రెండు రోడ్డు వెడల్పు పనులకు మోడీ శంకుస్థాపన చేశారు. ఇవి మన బార్డర్ ఏరియాలకు అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ కనెక్టివిటీని అందిస్తాయని ఆయన అన్నారు. ఇవి స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్​ వ్యూలుగా కూడా పనికొస్తాయన్నారు.బద్రీనాథ్ వద్ద అలకనంద నది వెంబడి అభివృద్ధి పనుల పురోగతిని ప్రధాని పరిశీలించారు. ప్రధాని శుక్రవారం రాత్రి బద్రీనాథ్​లోనే బస చేశారు. శనివారం కూడా వివిధ అభివృద్ధి పనులపై రివ్యూ నిర్వహించనున్నారు.

‘చోళ డోరా’ ధరించి పూజలు  

కేదార్ నాథ్ ఆలయంలో పూజల సందర్భంగా మోడీ ‘చోళ డోరా’ అనే ప్రత్యేక తెల్లని వస్త్రాలను, సంప్రదాయ టోపీని ధరించారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ లో పర్యటించిన సందర్భంగా ప్రధానికి చేతితో తయారు చేసిన ఈ వస్త్రాలను అక్కడి మహిళలు అందజేశారు. అవసరమైనప్పుడు వీటిని ధరిస్తానని మోడీ వారికి హామీ ఇచ్చారు. శుక్రవారం కేదార్ నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజల సందర్భంగా వాటిని ధరించారు.