ముషీరాబాద్, వెలుగు : బీసీల సంక్షేమం, అభివృద్ధి కోసం బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి జోక్యం చేసుకొని బీసీలకు ప్రత్యేకంగా సబ్‌ప్లాన్ ప్రవేశపెట్టాలని కోరారు. విద్యానగర్‌లోని బీసీ భవన్‌లో గురువారం జరిగిన బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టో, కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఏటా రూ. 20 వేల కోట్లు ఇస్తామని ప్రకటించి, ఇప్పటివరకు రూ. 10 వేల కోట్లకు మించి కేటాయించలేదన్నారు. రాష్ట్రంలో రెండేండ్లుగా బీసీ సంక్షేమం కుంటుపడిందని, కొత్త పథకాలూ లేవన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌ల చెల్లింపులు ఆగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల మాదిరిగానే బీసీ, ఈబీసీ విద్యార్థులకు పూర్తి ఫీజులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం రూ. 5 వేల కోట్లు కేటాయించి, ఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల రుణం ఇవ్వాలన్నారు. అలాగే 12 బీసీ ఫెడరేషన్లకు రూ. 5 వేల కోట్లు, ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ. 2 వేల కోట్లు కేటాయించాలని కోరారు.
