రాష్ట్ర సర్కార్ నిర్వాకంతో ఎస్ఎస్ఏ ఫండ్స్ కు కోత 

రాష్ట్ర సర్కార్ నిర్వాకంతో ఎస్ఎస్ఏ ఫండ్స్ కు కోత 
  • రాష్ట్ర సర్కార్ నిర్వాకంతో ఎస్ఎస్ఏ ఫండ్స్ కు కోత 
  • మ్యాచింగ్ గ్రాంట్స్, యూసీలు ఇవ్వని ప్రభుత్వం 
  • మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆర్టీఐ అప్లికేషన్​లో వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ నిర్వాకంతో సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) కింద కేంద్రం ఇస్తున్న నిధుల్లో భారీగా కోత పడుతోంది. ఐదేండ్లలో ఏకంగా రూ.6,079 కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. రాష్ట్ర సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వకపోవడం, సరైన సమయంలో కేంద్రానికి యుటిలైజేషన్ సర్టిఫికెట్లు (యూసీలు) అందజేయకపోవడమే ఇందుకు కారణం. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి ఆర్టీఐ ద్వారా విద్యాశాఖ నుంచి వివరాలు సేకరించడంతో ఇది బయటపడింది. బడుల్లో సౌలతులు కల్పించేందుకు ఎస్ఎస్ఏ కింద కేంద్రం ఏటా రాష్ట్రానికి నిధులు కేటాయిస్తోంది. కేంద్రం 60% నిధులిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 40% మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్రానికి ఎస్ఎస్ఏ కింద 2017-–18 నుంచి 2021–-22 వరకు మొత్తం రూ.11,541.32 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. అయితే ఈ ఐదేండ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇచ్చిన నిధులు రూ.5,283.22 కోట్లు మాత్రమే. ఇందులో కేంద్రం తన వాటాగా రూ.3,141.46 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.2141.76 కోట్లు ఇచ్చింది. కొన్ని నిధులు కేంద్రం అడ్వాన్స్ కింద ఇవ్వగా, మొత్తంగా ఐదేండ్లలో ఖర్చు చేసింది కేవలం రూ.5,462.96 కోట్లు మాత్రమే. నిధులు ఇచ్చేందుకు కేంద్రం రెడీగా ఉన్నా, రాష్ట్ర సర్కార్ మ్యాచింగ్ గ్రాంట్స్, యూసీలు ఇవ్వకపోవడంతో వేల కోట్లకు కోత పడింది. మొత్తంగా ఐదేండ్లలో రాష్ట్రానికి రావాల్సిన రూ.6,079 కోట్లు  రాకుండా పోయాయి.  

ఏటా రెండు వేల కోట్లకు పైగానే..
అధికారిక లెక్కల ప్రకారం ఏటా రాష్ట్రానికి రూ.2 వేల కోట్లకు పైగానే నిధులు ఇచ్చేందుకు కేంద్రం ఆమోదం తెలుపుతోంది. 2021–22 విద్యా సంవత్సరంలో రూ.2,142.49 కోట్ల బడ్జెట్​కు ఆమోదం తెలిపింది. కానీ చివరికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చింది కేవలం రూ.922.13 కోట్లే. టెక్ట్స్ బుక్స్, యూనిఫామ్స్ కోసం అడ్వాన్స్​గా ఇచ్చిన గ్రాంట్స్​తో కలిపి రూ.1,023.80 కోట్లు(47.79%) ఖర్చు చేశారు. అయితే గతంలో ఇచ్చిన నిధులకు సంబంధించిన యూసీలు మార్చి15లోపు ఇస్తే, మరో విడత గ్రాంట్స్ ఇస్తామని రాష్ట్రానికి కేంద్రం సూచించింది. కానీ రాష్ట్ర సర్కార్ మార్చి 29న కొంత బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఆర్డర్ ఇచ్చింది. దీంతో ఒకట్రెండు రోజుల్లో వందల కోట్లు ఖర్చు చేయడం సాధ్యం కాదని, మిగిలిన గ్రాంట్స్ ఇవ్వబోమని కేంద్రం ప్రకటించింది. 

ఇదీ కేసీఆర్ నిబద్ధత: మురళి 
‘‘ఆర్టీఐ ప్రకారం లెక్కలు తీస్తే మన తెలంగాణ ప్రభుత్వం గత 8 ఏండ్లలో కేంద్రం ఆమోదించిన సుమారు రూ.9,456 కోట్లు విద్యాశాఖలో ఖర్చు చేయకుండా మురగపెట్టింది. ఇందులో రాష్ట్రం 40 శాతం ఇస్తే, కేంద్రం 60 శాతం ఇస్తుంది. ఇదీ సీఎం కేసీఆర్ కు పేద పిల్లల విద్య మీద ఉన్న నిబద్ధత” అని ఆకునూరి మురళి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ తో పాటు ఆర్టీఐ ద్వారా తీసుకున్న వివరాలను మంత్రి కేటీఆర్​కు ట్యాగ్ చేశారు.

కేంద్ర నిధులనే అటీటు తిప్పుతున్రు
కేంద్రం నుంచి ఎస్ఎస్ఏ నిధులు నేరుగా రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో పడతాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటా మొత్తాన్ని కలిపి ఎస్ఎస్ఏకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఏనాడూ రాష్ట్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. కేంద్రం ఇచ్చే తొలి విడత నిధులనే నెలల తరబడి తన దగ్గర పెట్టుకొని, చివరికి ఆ నిధులనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటాగా మార్చి జీవోలు ఇస్తోంది. కేంద్రం ఇచ్చిన మొత్తా నికి యూసీలు ఇస్తేనే, రెండో విడత నిధులను కేంద్రం ఇస్తుంది. రాష్ట్ర ఎస్ఎస్ఏకు ఆ నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర సర్కార్​ తిప్పలు పెడుతోంది.