ఏపీఐఐసీ ఉద్యోగికి స్థల కేటాయింపు చట్టబద్ధమే: హైకోర్టు

ఏపీఐఐసీ ఉద్యోగికి స్థల కేటాయింపు చట్టబద్ధమే: హైకోర్టు

హైదరాబాద్, వెలుగు: జీడిమెట్లలోని ఇండస్ట్రీయల్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌ ఫేజ్‌‌‌‌–2లో  ఆంధ్రప్రదేశ్‌‌‌‌ ఇండస్ట్రియల్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌(ఏపీఐఐసీ) ఉద్యోగి రష్మీ అభిచందణికి స్థల కేటాయింపు చట్ట నిబంధనలకు అనుగుణంగానే జరిగిందని హైకోర్టు వెల్లడించింది. 2010లో స్థలాన్ని కేటాయించినప్పుడు గజం ధర రూ.12 వేలు ఉంటే ఆమె రూ.6 వేలే చెల్లించారని, మిగిలిన రూ. 6 వేలను మూడు నెల్లల్లో కట్టాలని లబ్ధిదారును ఆదేశించింది. ఏపీఐఐసీ ఉద్యోగి అభిచందణి ప్రొబేషన్‌‌‌‌ పీరియడ్‌‌‌‌లో ఉండగా జీడిమెట్లలోని ఇండస్ట్రీయల్‌‌‌‌ హౌసింగ్‌‌‌‌ కాంప్లెక్స్‌‌‌‌ ఫేజ్‌‌‌‌-2లో  ప్లాట్‌‌‌‌ కోసం దరఖాస్తు చేసుకుంది. 

తొలుత ఆమెకు 265 గజాల ప్లాట్‌‌‌‌ ను తాత్కాలికంగా కేటాయించారు. ఆ తర్వాత 523.50 గజాలను కేటాయించారు. దీనికి ఆమె మొత్తం రూ.31,41,000 చెల్లించి సేల్‌‌‌‌ డీడ్‌‌‌‌ పొందారు. రష్మీ అభిచందణి చట్టవిరుద్ధంగా ప్లాట్‌‌‌‌ పొందారని..సదరు ప్లాట్‌‌‌‌ను బహిరంగ వేలం వేయాలని ఏపీఐసీసీకి ఆదేశించాలని కోరుతూ గాడిపల్లి మల్లారెడ్డి అనే వ్యక్తి 2011లో హైకోర్టులో పిటిషన్‌‌‌‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను చీఫ్‌‌‌‌ జస్టిస్‌‌‌‌ అలోక్‌‌‌‌ అరాథే, జస్టిస్‌‌‌‌ అనిల్‌‌‌‌ కుమాక్ తో కూడిన డివిజన్‌‌‌‌ బెంచ్‌‌‌‌ విచారించింది.  పిటిషనర్‌‌‌‌ తరఫున సీనియర్‌‌‌‌ న్యాయవాది గండ్ర మోహన్‌‌‌‌రావు వాదిస్తూ.."రష్మీ అభిచందణికి గతంలోనే ఇల్లు, రెండు ప్లాట్లు ఉన్నాయి. 

అయినా ఆమెకు ప్లాటు కేటాయించడం చట్టవిరుద్ధం. భూ సేకరణ జరిపి ఏపీఐసీసీ పరిశ్రమలకు కేటాయించాలి తప్ప.. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కూడా సరికాదు. అదీ కూడా ప్రొహిబిషన్‌‌‌‌లో ఉద్యోగికి కేటాయించడం సమర్థనీయం కాదు. ఇలా ప్లాట్‌‌‌‌ కేటాయించడం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుంది"  కోర్టుకు వివరించారు. అభిచందణి తరఫు న్యాయవాది వాదిస్తూ.. పిటిషన్‌‌‌‌ను ఉద్దేశపూర్వకంగా దాఖలు చేశారని, ప్రజా ప్రయోజనం లేదన్నారు.  వాదనలు విన్న ధర్మాసనం..ప్లాట్ కేటాయింపులో ఎలాంటి జోక్యం అవసరం లేదని అభిప్రాయపడింది. ప్లాట్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ విలువలో సగం మొత్తాన్ని గతంలో చెల్లించినందున మిగిలిన మొత్తాన్ని 3 నెలల్లోగా చెల్లించాలని లబ్ధిదారును ఆదేశించింది.