కోవిషీల్డ్‌ రెండో డోస్ 4వారాలకే వేసుకోనివ్వండి

కోవిషీల్డ్‌ రెండో డోస్ 4వారాలకే వేసుకోనివ్వండి
  • వ్యాక్సిన్ ప్రొటోకాల్ ను సవరించాలని కేరళ హైకోర్టు ఆదేశం

తిరువనంతపురం: కోవిషీల్డ్‌ రెండో డోస్ 4 వారాలకే వేసుకునే అవకాశం కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి కేరళ హైకోర్టు ఆదేశాలిచ్చింది. కరోనా వ్యాక్సిన్ పాత ప్రొటొకాల్‌ ప్రకారం కోవిషీల్డ్‌ తొలి టీకా తీసుకున్నవారిలో ఎవరైనా 4 వారాలకే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకోవాలనుకుంటే అందుకు వారికి అనుమతించాలని కేరళ హైకోర్టు సూచించింది. వ్యాక్సిన్ ప్రొటోకాల్ లో ఈ మేరకు రెండో టీకాను షెడ్యూల్‌ చేయాలని తెలిపింది.

పాత ప్రొటొకాల్‌ ప్రకారం నాలుగు వారాలకే రెండో టీకా తీసుకునే అవకాశం ఉండగా.. దాన్ని సవరించి రెండో డోసు టీకా గడువును 84 రోజులకు పొడిగించారు. అయితే విదేశాలకు వెళ్లేవారికి తొందరగా రెండో టీకా వేసుకునేందుకు నిబంధన సడలించారు. అయితే దేశంలో ఉన్నవారు మాత్రం తొందరగా రెండో డోస్ టీకా తీసుకుని సురక్షితంగా ఉండాలని భావిస్తుంటే.. ఎందుకు అనుమతివ్వడం లేదని జస్టిస్ పి.బి సురేష్ కుమార్ ప్రశ్నించారు. కైటెక్స్‌ గార్మెంట్స్‌ కంపెనీ వేసిన పిటీషన్‌ను విచారించిన కేరళ హైకోర్టు ఈమేరకు ఆదేశాలు ఇచ్చింది. తన కార్మికులకు 84 రోజులు కాకుండా తొలి ప్రొటొకాల్‌ ప్రకారం 4 వారాలకే టీకా వేసుకునేలా అనుమతించాలని కైటెక్స్ గార్మెంట్ కంపెనీ అభ్యర్థనను మన్నించాలని.. ఈ మేరకు కోవిన్‌ యాప్‌లో మార్పు చేయాలని కేరళ హైకోర్టు సూచించింది.