బడులకు కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. 

బడులకు కేంద్రం నిధులు విడుదల చేస్తున్నా.. 
  • మూడేండ్లుగా స్కూల్ సేఫ్టీ, స్పోర్ట్స్, లైబ్రరీ గ్రాంట్స్ ఇస్తలేదు

హైదరాబాద్, వెలుగు: ‘‘దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదు” అన్నట్టుగా తయారైంది సర్కారు బడుల పరిస్థితి. బడుల బాగు కోసం కేంద్ర ప్రభుత్వం అనేక రకాల గ్రాంట్స్ ను రాష్ట్రానికి ఇస్తున్నా.. అవేవీ ప్రభుత్వ స్కూళ్లకు చేరడం లేదు. కేవలం స్కూల్ గ్రాంట్స్ మినహా మిగిలిన పలు గ్రాంట్స్ ను బడులకు ఇవ్వకుండా  రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొడుతోంది. ఏండ్ల నుంచి ఇదే తంతు కొనసాగుతోంది. పోయినేడాది స్కూల్ గ్రాంట్స్ నిధులనూ ఆయా స్కూళ్ల ఖాతాల నుంచి ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. దీంతో నిధుల్లేక బడుల్లో ఇబ్బందులు నెలకొన్నాయి. రాష్ట్రంలో 26 వేలకు పైగా సర్కారు స్కూళ్లుండగా, 20 లక్షల మందికి పైగా స్టూడెంట్లు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కేంద్రం సమగ్ర శిక్షా అభియాన్(ఎస్ఎస్ఏ) ద్వారా ఏటా రూ.కోట్ల నిధులు కేటాయిస్తోంది. 2022–23 విద్యా సంవత్సరానికి గాను రూ.1,787 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. దీనికి 40% నిధులు రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్స్ ఇవ్వాల్సి ఉంది. 

ఈసారైనా ఇస్తదా? 

సమగ్ర శిక్షా అభియాన్​ కింద స్కూల్ గ్రాంట్స్​తో పాటు వేర్వేరుగా ఇతర గ్రాంట్స్ ను కేంద్రం ఇస్తోంది. అయితే రాష్ట్రంలో మాత్రం స్పోర్ట్స్, లైబ్రరీ గ్రాంట్స్​తో పాటు స్కూల్ సేఫ్టీ కోసం కేంద్రం ఇచ్చే నిధులను బడులకు ఇవ్వడం లేదు. మూడేండ్ల నుంచి ఇట్లనే చేస్తున్నారు. దీంతో బడుల్లో ఒక్క కొత్త పుస్తకం గానీ, ఒక్క క్రీడా పరికరం గానీ కొనుగోలు చేయలేదు. గతేడాది సుమారు రూ.61.51 కోట్ల నిధులు దారి మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో లైబ్రరీ గ్రాంట్స్ రూ.24.24 కోట్లు, స్పోర్ట్స్ గ్రాంట్స్ రూ.29.51 కోట్లు, స్కూల్ సేఫ్టీ ప్రోగ్రామ్ నిధులు రూ.7.76 కోట్లు ఉన్నాయి. ఈ మూడు గ్రాంట్స్ కింద కేంద్రం ఈసారి రూ.41 కోట్లు కేటాయించగా.. అవి ఈసారైనా స్కూళ్లకు అందుతాయా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర సర్కార్ ఇస్తదో? లేదోనని హెడ్మాస్టర్లు ఆందోళనలో ఉన్నారు. లైబ్రరీల్లో పుస్తకాలు, క్రీడా పరికరాలు లేక ఇబ్బందులు పడుతున్నామని.. రాష్ట్ర సర్కార్ ఈసారైనా కేంద్రం ఇచ్చే నిధులను బడులకు ఇవ్వాలని స్టూడెంట్లు, టీచర్లు కోరుతున్నారు.

ఈసారి రూ.41 కోట్లు   

ఈసారి స్కూల్ గ్రాంట్స్​కింద కేంద్రం రూ.84.60 కోట్లు కేటాయించింది. రూ.41 కోట్లకు పైగా స్కూల్ సేఫ్టీ, స్పోర్ట్స్, లైబ్రరీ గ్రాంట్స్ కు ఓకే చెప్పింది. ఇందులో లైబ్రరీ గ్రాంట్ రూ.17.11 కోట్లు కాగా.. 18,385 ప్రైమరీ స్కూళ్లకు రూ.5 వేల చొప్పున రూ.9.12 కోట్లు, 3,241 అప్పర్ ప్రైమరీ స్కూళ్లకు రూ.10 వేల చొప్పున రూ.3.24 కోట్లు, 4,680 హైస్కూళ్లకు రూ.10 వేల చొప్పున రూ.4.68 కోట్లు ఇస్తామని తెలిపింది. స్పోర్ట్స్ గ్రాంట్స్ కింద రూ.17.11 కోట్లు ఇస్తామని చెప్పింది. ఇక స్కూల్ సేఫ్టీ కింద 26,306 స్కూళ్లకు రూ.2 వేల చొప్పున రూ.6.81 కోట్లు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించింది. వీటితో పాటు 55,298 మంది టీచర్లకు ట్రైనింగ్ కోసం రూ.1.65 కోట్లు కేటాయించింది.