
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టులో టీమిండియాకు షాక్ ఇస్తూ ఇంగ్లాండ్ థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (181 బాల్స్‌లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 61 నాటౌట్) అత్యద్భుత పోరాటంతో ఇంగ్లండ్ బౌలర్లకు ఎదురు నిలిచినా.. మిగతా బ్యాటర్లు నిరాశ పరచడంతో మూడో టెస్టులో ఇండియా 22 రన్స్ తేడాతో ఓడిపోయింది. 193 పరుగుల లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక 170 పరుగులకే మన జట్టు ఆలౌట్ అయింది. మరోవైపు చివరి రోజు అద్భుతంగా బౌలింగ్ చేసిన ఇంగ్లాండ్ 22 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ పై ఆస్ట్రేలియా మహిళా కెప్టెన్, స్టార్క్ భార్య అలిస్సా హీలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఆస్ట్రేలియా మహిళా జట్టు కెప్టెన్ అలిస్సా హీలీ లిస్ట్‌నర్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ ఇలాంటి థ్రిల్లింగ్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ ఉంటే తనకు చాలా ఇష్టమని, ఒత్తిడి పరిస్థితుల్లో అతను బాగా రాణిస్తాడని ఆమె తెలిపింది. "రెండు జట్లు ఈ మ్యాచ్ లో పోరాడిన తీరు నాకు చాలా నచ్చింది. ఇరు జట్ల మధ్య మాటల యుద్ధం ఆటలో చూపించడం మజా ఇచ్చింది. ప్రస్తుత భారత జట్టును ఉద్దేశించి నేను ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. ఈ టెస్ట్ మ్యాచ్ లో విరాట్ కోహ్లీని మిస్ అయ్యేలా చేసింది. ప్రతికూల పరిస్థితుల్లో టెస్ట్ మ్యాచ్ గెలిపించడానికి పోరాడేవాడు. లార్డ్స్ టెస్టులో కోహ్లీ ఉంది ఉంటే మ్యాచ్ ను మలుపు తిప్పేవాడు". అని హీలే చెప్పుకొచ్చింది.
టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 387 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్ లో ఇండియా కూడా సరిగ్గా 387 పరుగులు చేసింది. భారత బౌలర్లు విజృంభించడంతో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది. 193 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 170 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో ఇంగ్లాండ్ సిరీస్‌లో 2–1తో ఆధిక్యం సాధించింది. స్టోక్స్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య నాలుగో టెస్టు ఈ నెల 23 నుంచి మాంచెస్టర్‌లో జరుగుతుంది.