IND vs WI: ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌కు కష్టాలు.. గాయాలతో ఇద్దరు స్టార్ పేసర్లు దూరం

IND vs WI: ఇండియాతో టెస్ట్ సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌కు కష్టాలు.. గాయాలతో ఇద్దరు స్టార్ పేసర్లు దూరం

అక్టోబర్ 2 నుంచి ఇండియాతో జరగనున్న రెండు మ్యాచ్ ల టెస్ట్‌ల సిరీస్‌కు ముందు వెస్టిండీస్‌కు ఊహించని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవలే సూపర్ ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియాతో తొలి టెస్టుకు ముందు ఫాస్ట్ బౌలర్ అల్జారి జోసెఫ్ గాయంతో సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. జేడాన్ సీల్స్‌తో కలిసి కొత్త బంతితో అద్భుతంగా బౌలింగ్ చేసే షమర్ జోసెఫ్, అల్జారి జోసెఫ్ దూరం కావడంతో విండీస్ జట్టుకు దిక్కుతోచని స్థితిలో నిలిచింది. 

జోసెఫ్ నడుము నొప్పి కారణంగా ఇండియాతో టెస్ట్ సిరీస్ కు దూరమవుతున్నాడని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సోమవారం (సెప్టెంబర్ 29) ధృవీకరించింది. జోసెఫ్ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ జెడియా బ్లేడ్స్‌ను ఎంపిక చేశారు. "అల్జారి జోసెఫ్ నడుము నొప్పి కారణంగా భారత్‌తో జరగనున్న టెస్ట్ సిరీస్‌కు దూరమయ్యాడు. స్కానింగ్ చేసిన తర్వాత అతనికి రెస్ట్ కావాలని భావించాం. వన్డే, టీ20 ఇంటర్నేషనల్స్‌లో అద్భుతంగా రాణిస్తున్న జెడియా బ్లేడ్స్ నేపాల్‌తో జరుగుతున్న టీ20సిరీస్ తర్వాత జట్టులో చేరనున్నాడు". అని విండీస్ క్రికెట్ వారి అధికారిక ఎక్స్ లో మంగళవారం (సెప్టెంబర్ 30) పోస్ట్ చేసింది. జోసెఫ్ ఇప్పటివరకు 40 టెస్ట్‌లలో 124 వికెట్లు తీసిన అనుభవం ఉంది.  

షమర్ జోసెఫ్ కు గాయం: 

సూపర్ ఫామ్ లో ఉన్న ఫాస్ట్ బౌలర్ షమర్ జోసెఫ్ శుక్రవారం (సెప్టెంబర్ 26) గాయం కారణంగా సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. షమర్ స్థానంలో అన్‌క్యాప్డ్ ఆల్ రౌండర్ జోహన్ లేన్‌ను ఎంపిక చేశారు. జోసెఫ్ గాయం తీవ్రత ఎలా ఉందనే విషయం క్రికెట్ వెస్టిండీస్ (CWI) ఇంకా వెల్లడించలేదు. టెస్ట్ ఫార్మాట్ లో షమర్ జోసెఫ్ గణాంకాలు అద్భుతంగా ఉన్నాయి. ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 21.66 సగటుతో 51 వికెట్లు పడగొట్టాడు. 19 ఫస్ట్-క్లాస్ మ్యాచ్‌ల్లో 22.28 సగటుతో 66 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.  

రెండు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా అక్టోబర్ 2 నుంచి 6 వరకు తొలి టెస్ట్ మ్యాచ్.. అక్టోబర్ 10 నుంచి 14 వరకు రెండో టెస్ట్ జరుగుతుంది. తొలి టెస్టుకు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ఆతిధ్యమిస్తుంది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో రెండో టెస్ట్ జరుగుతుంది. మ్యాచ్ భారత కాలమాన ప్రకారం ఉదయం 9:30 నిమిషాలకు ప్రారంభమవుతుంది.  గిల్ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. రిషబ్ పంత్ దూరం కావడంతో వైస్ కెప్టెన్సీ పగ్గాలు జడేజాకు అప్పగించారు. 

ఇండియాతో టెస్ట్ సిరీస్ కు వెస్టిండీస్ జట్టు: 

రోస్టన్ చేజ్ (కెప్టెన్), జోమెల్ వారికన్ (వైస్-కెప్టెన్), కెవ్లాన్ ఆండర్సన్, అలిక్ అథనాజ్, జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చందర్‌పాల్, జస్టిన్ గ్రీవ్స్, షాయ్ హోప్, టెవిన్ ఇమ్లాచ్, జోహన్ లేన్, జెడియా బ్లేడ్స్, బ్రాండన్ కింగ్, ఆండర్సన్ ఫిలిప్, ఖారీ పియరీ, జేడెన్ సీల్స్.