అల్జీమర్స్ రావొద్దంటే..మీ లైఫ్ స్టైల్ లో ఈ మార్పులు తప్పనిసరి

అల్జీమర్స్ రావొద్దంటే..మీ లైఫ్ స్టైల్ లో  ఈ మార్పులు తప్పనిసరి

ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. కొన్నిసార్లు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. సరిగ్గా చెప్పాలంటే.. కళ్లకుపెట్టుకున్న కళ్లద్దాలు, తల పైన టోపీ, జేబులో పర్స్​.. ఇవన్నీ ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాయి. కానీ, ఎక్కడో పెట్టానే.. గుర్తు రావట్లేదు అని బుర్ర గోక్కుంటూ వెతుకుతుంటారు. అవి ఉండాల్సిన చోటే ఉంటాయి కాబట్టి ఎంత వెతికినా కనపడవు. ఇంకొన్నాళ్లకు రోజూ తిరిగే దారులు కూడా మర్చిపోతుంటారు. అంతెందుకు కిచెన్​లోకి వెళ్లాలనుకుని బాత్​రూమ్​లోకి వెళ్తుంటారు. ఎవరితోనూ మాట్లాడకుండా సైలెంట్​గా, ఒంటరిగా ఉంటుంటారు. ఇలా ఉంటే అది అల్జీమర్స్​ వ్యాధి అంటున్నారు డాక్టర్లు. ఈ లక్షణాలు ఎక్కువైతే పరిస్థితి మరింత ఘోరంగా తయారవుతుంది. అందుకే ఏ వ్యాధి అయినా రాకముందే అరికట్టాలి. అలా అడ్డుకోవాలంటే దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి అంటున్నారు. సెప్టెంబర్​ 21 ‘వరల్డ్ అల్జీమర్స్ డే’ సందర్భంగాన్యూరాలజిస్ట్​ కైలాష్​ ఏమంటున్నారంటే.. 

అల్జీమర్స్​ను మెమొరీ డిస్టర్బెన్స్, న్యూరో డిజనరేటివ్ డిసీజ్​ అంటుంటారు. ఇది ఎక్కువగా పెద్ద వయసువాళ్లలో అంటే 60 లేదా 65 ఏండ్లు పైబడిన వాళ్లలో కనిపిస్తుంటుంది. వయసుపైబడే కొద్దీ ఆలోచనలు, జ్ఞాపకశక్తితోపాటు అలవాట్లలో కూడా మార్పులు వస్తాయి. ఒకానొక సమయానికి వాళ్ల మాటలో కూడా తేడా వస్తుంది. మనసులో ఉన్న వాటిని స్పష్టంగా బయటకు చెప్పలేరు. అలాగే ఇతరులు చెప్పే చిన్న చిన్న విషయాలు కూడా వాళ్లకు అర్థం కావు. మాట్లాడేటప్పుడు అవతలి వ్యక్తి మాట మీద శ్రద్ధ ఉండదు. అలాగే ఏ పనీ సరిగా చేయలేరు. ఏకాగ్రత కోల్పోతారు. కొన్నిసార్లు 40 పైబడిన వాళ్లలో కూడా అల్జీమర్స్ డిసీజ్ వస్తుంటుంది. అందుకు కారణం వాళ్ల ఫ్యామిలీ హిస్టరీలో ఆల్రెడీ అల్జీమర్స్ ఉండడమే. జన్యులు వంశపారంపర్యంగా వస్తాయి కాబట్టి తర్వాతి జనరేషన్​లో ఈ వ్యాధి త్వరగా వచ్చే ప్రమాదం ఉంది. అయితే ఈ కండిషన్​ని చాలా అరుదుగా చూస్తాం. ఇలాంటివాళ్లకు సింప్టమ్స్ కూడా త్వరగా కనిపిస్తాయి. కాబట్టి జెనెటిక్ టెస్ట్ చేస్తే వెంటనే వ్యాధిని గుర్తించొచ్చు. తద్వారా తగిన ట్రీట్​మెంట్ అందించొచ్చు. ఈ వ్యాధి వస్తుందని ఎలా పసిగట్టొచ్చు? అంటే.. అందుకు అనారోగ్యకరమైన పరిస్థితులే సూచనలు. ఒబెసిటీ, బీపీ, డయాబెటిస్, ఎక్కువసేపు కూర్చునే ఉండడం, ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం, స్మోకింగ్ అలవాటు ఉన్నవాళ్లకు అల్జీమర్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ. ఇంకా చెప్పాలంటే.. అలాంటివాళ్లకు ఈ వ్యాధి కాస్త ముందుగానే వచ్చేస్తుంది. కొన్ని సందర్భాల్లో అల్జీమర్స్​నే డిమెన్షియా అని కూడా అంటుంటారు. డిమెన్షియాలో రకరకాలుంటాయి. వాటిన్నింటిలో కామన్​గా వచ్చేది ఏంటంటే అల్జీమర్స్​. అయితే చాలామంది డిప్రెషన్​ వల్ల ఏదీ గుర్తుండట్లేదు అంటుంటారు. అది అల్జీమర్స్ కాదు. ఆ కండిషన్​ని సూడో డిమెన్షియా అంటారు. అంటే వాళ్లు డిప్రెషన్​ నుంచి బయటకు వస్తే తిరిగి వాళ్ల జ్ఞాపకశక్తి వాళ్లకు వచ్చేస్తుంది. 

ఎలా గుర్తించాలి?

ముందు నుంచీ వాళ్లకు జడ్జ్​మెంట్ ఉండదు. ఒక ఏజ్ వచ్చాక జ్ఞాపకశక్తి లోపిస్తుంది. ఎంతగా అంటే.. పొద్దున తిన్న టిఫిన్​ మధ్యాహ్నానానికి గుర్తుండదు. ఏ పని చేసినా కొన్ని గంటల్లోనే మర్చిపోతారు. ఆ పని చేసినట్టు వాళ్లకు అస్సలు గుర్తుండదు. ఒకే ప్రశ్న మళ్లీ మళ్లీ అడుగుతుంటారు. ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లినా దారులు మర్చిపోతుంటారు. ఉదాహరణకు కిచెన్​ రూమ్​కు వెళ్లాలనుకున్న వాళ్లు దారి మర్చిపోయి మరో రూమ్​లోకి వెళ్తుంటారు. కొన్నిరోజుల తర్వాత నిద్రలో డిస్టర్బెన్స్​లు కూడా వస్తాయి. అంటే.. నిద్రపోతున్న వాళ్లు అకస్మాత్తుగా మేల్కోవడం. మళ్లీ ఎంత ట్రై చేసినా నిద్ర పట్టకపోవడం వంటివి జరుగుతాయి. అందరితో కలవడం మానేస్తారు. ఎంతసేపైనా ఒంటరిగా ఉంటుంటారు. ఇంట్లో ఏవైనా ఫంక్షన్లు వంటివి జరిగినా ఆ కార్యక్రమాల్లో యాక్టివ్​గా పార్టిసిపేట్ చేయరు. వాళ్ల ఇన్వాల్వ్​మెంట్​ ఉండదు. చెప్పాలనుకున్న విషయం సరిగా చెప్పలేరు. మాటల్లో తడబాటు ఉంటుంది. ఆకలి మందగిస్తుంది. సన్నగా అయిపోతారు. చివరి దశలో శారీరకంగా బాగానే ఉండి నడవగలుగుతున్నా బాత్​రూమ్​కి వెళ్లాల్సి వచ్చినప్పుడు వెంటనే ఆ ఆలోచన రాదు. బ్రెయిన్​ నుంచి సిగ్నల్​ అందకపోవడం వల్ల శరీరంలో కదలిక ఉండదు. అందువల్ల మలమూత్ర విసర్జనల్లో కంట్రోల్​ తప్పుతుంది. ప్రస్తుతం ఉన్న రికార్డ్స్ ప్రకారం ఇండియాలో చూస్తే మగవాళ్లలోనే ఈ కండిషన్​ ఎక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాల్లో అక్కడి పరిస్థితులను బట్టి స్టాటిస్టిక్స్ వేరుగా ఉంటున్నాయి. కాబట్టి ఆడవాళ్లు, మగవాళ్లు అని తేడాలేకుండా ఎవరికైనా వచ్చే చాన్స్ ఉంది. 

స్కాన్ చేస్తే..

అల్జీమర్స్​ను గుర్తించాలంటే.. ఎంఆర్​ఐ స్కాన్ చేస్తారు. ఆ స్కాన్​ చూస్తే తెలిసిపోతుంది. అలాగే ఇప్పుడు కొత్త టెక్నిక్స్ కూడా ఉన్నాయి. వెన్నెముక నుంచి లిక్విడ్ శాంపిల్ తీసి ల్యాబ్​ టెస్ట్​కి పంపిస్తే అందులోని కెమికల్స్​​ని టెస్ట్ చేస్తారు. వాటి వ్యాల్యూని బట్టి అల్జీమర్స్​ డిసీజ్​ ఉందో లేదో తెలుస్తుంది. మరొకటి పెక్​​ స్కాన్​.. దీనివల్ల బ్రెయిన్​లో ఏ భాగంలో ఫంక్షనింగ్​లో తక్కువగా ఉందో తెలుస్తుంది. అల్జీమర్స్​కు ఇప్పటివరకు ప్రత్యేకించి ఒక ట్రీట్​మెంట్ లేదు. ఎందుకు వస్తుందో కూడా పూర్తిగా, పర్టిక్యులర్​గా కారణాలు తెలియదు. కాకపోతే అబ్​నార్మల్​ కణాలు బ్రెయిన్​లో ఉండిపోవడం వల్ల వస్తుందని చెప్తారు. కానీ, దానికి కూడా ఎఫెక్టివ్​ ట్రీట్​మెంట్ లేదు. కానీ, అల్జీమర్స్​ ఉందని కన్ఫర్మ్​ అయ్యాక కొన్ని మెడిసిన్స్ ఇస్తారు. తద్వారా లక్షణాలు ఎక్కువగా కాకుండా కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే అవి ఒకసారి మొదలుపెడితే లైఫ్​ లాంగ్ వాడాల్సి ఉంటుంది. అందుకని స్కాన్​లు చేసినప్పుడు అల్జీమర్స్ వస్తుందనే డౌట్​ వచ్చిన వెంటనే దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయాలి. 

కంట్రోల్ చేయడమే..

అల్జీమర్స్​ను కంట్రోల్ చేయడానికి లైఫ్​ స్టయిల్​లో మార్పులు చేసుకోవడం చాలా ఇంపార్టెంట్​. అవేంటంటే.. రెగ్యులర్​గా ఎక్సర్​సైజ్ చేయాలి. నిద్ర సరిపడా ఉండాలి. ఒత్తిడి కలిగించే పనులకు దూరంగా ఉండాలి. రోజూ 30–40 నిమిషాలు తప్పనిసరిగా ఏరోబిక్స్ చేయాలి. ఎర్లీ స్టేజ్​లో ఉన్నవాళ్లకు కాగ్నిటివ్ ట్రీట్​మెంట్​లో భాగంగా మ్యూజిక్ థెరపీ ఇస్తారు. అలాగే మైండ్​ గేమ్స్​ ఆడడం వల్ల బెటర్ అవుతారు. సుడోకు లాంటి పజిల్స్​ రెగ్యులర్​గా చేయడం వల్ల బ్రెయిన్​ పనితీరు బాగుంటుంది. తిండి విషయంలో ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, వాల్​నట్స్ తప్పకుండా తీసుకోవాలి. వీటితోపాటు విటమిన్​ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. బి12 తక్కువున్నా, థైరాయిడ్​ ఉన్నా వాటికి సంబంధించిన మెడిసిన్స్ వంటివి వాడాలి. బీపీ, డయాబెటిస్​ ఉన్నవాళ్లు వాటిని కంట్రోల్​లో ఉంచుకోవాలి. నూనెలో వేయించిన పదార్థాలు, ప్రాసెస్డ్ ఫుడ్స్​కు దూరంగా ఉండాలి. ఉప్పు తగ్గించాలి. ఆల్కహాల్ తీసుకోకూడదు. స్మోకింగ్​ చేయకూడదు. ఈ అవేర్​నెస్​ ఎందుకంటే.. ఏ వ్యాధి అయినా ముందుగా గుర్తించకపోతే లక్షణాలు ముదిరి ప్రమాదం జరగొచ్చు. అందువల్ల ఎర్లీగా కనుక్కుంటే ఇంకొన్నాళ్లు వ్యాధి బారిన పడకుండా లేదా మరీ ఎక్కువగా ఎఫెక్ట్​ కాకుండా కంట్రోల్ చేయొచ్చు. ఆ ఉద్దేశంతోనే సెప్టెంబర్​ 21న ప్రతి ఏటా ‘వరల్డ్ అల్జీమర్స్​ డే’గా సెలబ్రేట్ చేస్తున్నారు. ఇండియాలో ఎక్కువగా బీపీ, డయాబెటిస్​, ఒబెసిటీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారు. వాళ్లు ఆ వ్యాధులను కంట్రోల్ చేసుకోకపోతే అల్జీమర్స్​ అనే ముప్పు పొంచి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అల్జీమర్స్​ గురించి తెలుసుకోవాలి.

- డాక్టర్
కైలాష్​ ఎం.
సీనియర్ న్యూరాలజిస్ట్​, 
కేర్ హాస్పిటల్స్, హైదరాబాద్