30 శాతం మందిలో అల్జీమర్స్

30 శాతం మందిలో అల్జీమర్స్

అల్జీమర్స్ అనేది ఒకరకం డిమెన్షియా. పార్కిన్సన్స్​ డిమెన్షియా, వాస్క్యులార్, ఫ్రాంటోటెంపోరల్, లెవీ బాడీ, మిక్స్​డ్​ డిమెన్షియా.... అని రకాలుంటాయి. అయితే ఎక్కువమందిలో సాధారణంగా కనిపించేది మాత్రం అల్జీమర్స్. మామూలుగా 70 ఏండ్లు పైబడిన వాళ్లలో అల్జీమర్స్ ఎక్కువ. వయసు పెరిగేకొద్దీ అల్జీమర్స్ లక్షణాల తీవ్రత ఎక్కువైతుంది. 65  ఏండ్లు దాటిన వాళ్లలో 10 శాతం మంది, 85  ఏండ్ల వయసు ఉన్న 30 శాతం మందిలో అల్జీమర్స్​ కనిపిస్తుంది. మరికొందరిలో జెనెటిక్​ కారణాల వల్ల అల్జీమర్స్ వస్తుంది. 

కారణం ఇది

మెదడులోని టెంపోరలో అనే భాగంలో జ్ఞాపకశక్తికి సంబంధించిన కణాలు ఉంటాయి. అల్జీమర్స్​ బారినపడినవాళ్లలో ఈ  కణాలు సన్నగా, చిన్నగా అవుతాయి. దాంతో టెంపోరల్ ​ చిన్నగా అవుతుంది. అంతేకాదు ‘హైపోమెటబాలిజం’ ఉంటుంది. అంటే గ్లూకోజ్​తక్కువ అందుతుంది. దాంతో మెదడు చురుకుదనం కోల్పోతుంది. దాంతో ఆలోచనా శక్తి తగ్గిపోవడమే కాకుండా  జ్ఞాపకాలు చెదిరిపోయి, మతిమరుపు మొదలవుతుంది. 

ఈ లక్షణాలు కనిపిస్తే...

అల్జీమర్స్ లక్షణాల్లో  మొదట కనిపించేది ‘ఎపిసోడిక్​ మెమరీ లాస్’.​  ఒక్కొక్కటిగా తెలిసిన పని, విషయాల్ని మర్చిపోతారు. పొద్దున ఏం తిన్నారు? ఏం చేశారు? అనేవి కూడా గుర్తుండవు. కళ్లద్దాలు, చేతికర్ర ఎక్కడ పెట్టింది మర్చిపోతారు. ఒకసారి అడిగిన విషయం గురించే మళ్లీ మళ్లీ అడుగుతారు.  అల్జీమర్స్ ముదిరే కొద్దీ వస్తువుల పేర్లు గుర్తుండవు.  ఈ సిచ్యుయేషన్​ని ‘అనోమియా’ అంటారు.  రెగ్యులర్​గా, ఇష్టంగా చేసిన పనుల మీద ఇంట్రెస్ట్​ తగ్గిపోతుంది. దీన్నే ‘లాస్​ ఆఫ్​ ఇంట్రెస్ట్​’ అంటారు. ఉదాహరణకు టీవీ చూడడం, పేపర్ చదవడం, మార్నింగ్ వాక్​కి వెళ్లడం వంటి వాటిమీద ఆసక్తి ఉండదు. మాట తడబడుతుంది. ఏం చెప్పినా కూడా వెంటనే అర్థం చేసుకోలేరు.  మనుషుల పేర్లు మర్చిపోతారు. దీన్ని ‘అఫేషియా’ అంటారు. కొందరు సరిగా నడవలేరు. సొంతంగా పనులు చేసుకోలేరు. తెలిసిన వాళ్లని మొదటి సారిగా చూస్తున్నట్టు అనిపిస్తుంది వీళ్లకు. ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉంది? అనేది కూడా మర్చి పోతారు.  బయటికి వెళ్లినప్పుడు తిరిగి ఇంటికి వెళ్లే దారి గుర్తుండదు. 
  
అల్జీమర్స్ లక్షణాలు ఎక్కువయ్యే కొద్దీ వీళ్ల ప్రవర్తనలో తేడా కనిపిస్తుంది. యాంగ్జైటీ, కోపం, మానసిక ఒత్తిడి వంటివి ఎక్కువవుతాయి. వ్యక్తిగత శుభ్రత పాటించరు. దానివల్ల ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకని పెద్దవాళ్లలో అల్జీమర్స్ లక్షణాలు కనిపిస్తే, వాళ్లని డాక్టర్​ దగ్గరికి తీసుకెళ్లాలి. 

డయాగ్నసిస్ ఇలా...

మెదడులో ఏ భాగం దెబ్బతిన్నది? ఏ రకమైన డిమెన్షియా? అనేది తెలుసుకునేందుకు ‘న్యూరో కాగ్నిటివ్ టెస్ట్’ చేస్తారు. దీన్నే ‘న్యూరో సైకలాజికల్ టెస్ట్​’ అని కూడా పిలుస్తారు. మెదడులో ఏ భాగం ఎక్కువ అరిగిపోయింది అనే విషయం ఎంఆర్​ఐలో తెలుస్తుంది.  అమైలాయిడ్ పెట్​ (పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ) స్కాన్ ద్వారా కూడా అల్జీమర్స్​ఉందా? లేదా? తెలుసుకోవచ్చు.

ట్రీట్మెంట్: మతిమరుపు స్టేజ్​ని బట్టి మెడిసిన్​ వాడాలి. అల్జీమర్స్​ని పూర్తిగా తగ్గించలేం. కంటిన్యూగా మెడిసిన్స్ వాడితే అల్జీమర్స్​ లక్షణాల తీవ్రతను కంట్రోల్ చేయొచ్చు. అయితే ఈ సమస్య ఉన్నవాళ్లు కోలుకునేందుకు ఎన్ని సంవత్సరాలు పడుతుందనేది కచ్చితంగా చెప్పలేం.

ఈ అలవాట్లతో మేలు

అల్జీమర్స్ ఉన్నవాళ్లు  రోజూ పుస్తకం లేదా ఇష్టమైన నవలలు చదవాలి. పాటలు వినడం, డాన్స్ చేయడం, షటిల్ ఆటలు ఆడడం వల్ల కూడా మతిమరుపు కొంచెం తగ్గుతుంది. రోజూ ఎక్సర్​సైజ్​ చేసినా రిజల్ట్ కనిపిస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ ఉన్నవాళ్లని ఇంట్లోవాళ్లు జాగ్రత్తగా చూసుకోవాలి. ముఖ్యంగా వాళ్లను ‘నువ్వు ఎందుకు మర్చిపోతున్నావు. చిన్న విషయం కూడా గుర్తుండదా? ఎన్నిసార్లు చెప్పాలి?’ అని కోప్పడొద్దు. 

అంతేకాదు వాళ్లు ఉన్న గది బయటి గోడల మీద ‘బాత్​రూమ్​, కిచెన్ దారి ఇటు’ అని ఇండికేషన్స్​ రాసిపెట్టాలి. వాళ్లు యాంగ్జైటీ, స్ట్రెస్​కు లోనవ్వకుండా చూడాలి. వాళ్లు యాక్టివ్​గా ఉండేందుకు పండ్లు, నట్స్​తో పాటు చేపలు, అన్​శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్ తినిపించాలి.

వీళ్లకు రిస్క్ ఎక్కువ

చాలామందికి వయసు పెరగడం వల్ల అల్జీమర్స్ వస్తుంది. అయితే  ఆరోగ్య సమ స్యలు, కొన్ని అలవాట్ల వల్ల కూడా కొందరిలో అల్జీమర్స్​ కనిపిస్తుంది. ఎక్కువ రోజులు బీపీ, షుగర్ ఉన్నవాళ్లకు, పక్షవాతం ఉన్నవాళ్లకు, తలకు దెబ్బ తగిలిన వాళ్లకు అల్జీమర్స్​ రిస్క్​ ఎక్కువ. సిగరెట్ లేదా బీడీలు బాగా తాగేవాళ్లు, చాలారోజులుగా నిద్రలేమితో బాధపడుతున్నవాళ్లు, లావుగా ఉన్నవాళ్లు కూడా అల్జీమర్స్ బారిన పడే అవకాశం ఉంది.  

డా. విజయ్​కుమార్ బొడ్డు
కన్సల్టెంట్ న్యూరోఫిజీషియన్
రెనోవా హాస్పిటల్స్​, హైదరాబాద్.