అమరావతికి రావొద్దు..ఫ్లెక్సీలతో చంద్రబాబుకు నిరసన

అమరావతికి రావొద్దు..ఫ్లెక్సీలతో చంద్రబాబుకు నిరసన

ఏపీ మాజీ సీఎం చంద్రబాబు రాజధాని పర్యటనకు నిరసనగా భారీ ప్లెక్సీలు వెలిశాయి. చంద్రబాబు రాకను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు, రైతు కూలీల పేరుతో నిరసన ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. కృష్ణానది కరకట్ట నుంచి రాయపూడి వరకు ఈ ప్లెక్సీలను కట్టారు. రాజధాని పేరుతో మీరు చేసిన మోసానికి రైతులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజధాని రైతులకు క్షమాపణ చెప్పిన తర్వాతే బాబు రాజధానిలో అడుగు పెట్టాలన్నారు రైతులు. నిరసన ఫ్లెక్సీల్లో  చంద్రబాబును ప్రశ్నించారు రైతులు.

మరోసారి తమ జీవితాలతో ఆడుకోవద్దు చంద్రబాబు అంటూ నిరసన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజధాని పేరుతో రంగు రంగుల గ్రాఫిక్స్ చూపించి తమను ఎందుకు మోసం చేశారంటూ ప్రశ్నించారు. రాజధాని ప్రజలకు మీరు ఇస్తానన్న ఉచిత వైద్యం ఎందుకివ్వలేదన్నారు.  రాజధానిలో రైతు కూలీలకు జాతీయ ఉపాధి హామీ పథకం కింద 365 రోజులు పని కల్పిస్తారని ఎందుకు రైతుకూలీలను మోసం చేశారన్నారు. రాజధాని రైతులకు మీరు కేటాయించిన ప్లాట్లు ఎక్కడ ఉన్నాయని ప్రశ్నించారు. మీ ఆస్తులు కాపాడుకోవటం కోసం  రాజకీయాల కోసం రాజధానిని రాజకీయం చెయ్యొద్దని అన్నారు రాజధాని రైతులు.