కిషన్ రెడ్డి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న అమరావతి మహిళా రైతులు

కిషన్ రెడ్డి వద్ద కన్నీళ్లు పెట్టుకున్న అమరావతి మహిళా రైతులు

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డిని వేడుకున్నారు అమరావతి మహిళలు. గత కొన్ని వారాలుగా అమరావతిలో రైతులు, వారి కుటుంబసభ్యులు రాజధాని కోసం తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆదివారం కేంద్ర  కిషన్ రెడ్డిని అమరావతి మహిళలు కలిశారు. అమరావతి నుంచి పెద్ద సంఖ్యలో తమ గోడు చెప్పుకునేందుకు సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని కిషన్ రెడ్డి కార్యాలయానికి వెళ్లారు. అమరావతి లోనే రాజధాని ఉంచాలంటూ కిషన్ రెడ్డి పాదాలు పట్టుకొని  వేడుకున్నారు. ఆయన వద్ద ఉద్వేగానికి గురై తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. మహిళలు కన్నీళ్లు పెట్టుకోవడంతో కిషన్ రెడ్డి స్పందించారు. రైతులకు సాయం చేస్తానని హామీ ఇచ్చారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు ధైర్యాన్నివాల్సిన భాధ్యత , అన్యాయం కాకుండా చూడాల్సిన భాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ఏపీ, తెలంగాణ రెండు రాష్ట్రాలుగా ఏర్పడిన ఆరు సంవత్సరాల తర్వాత ప్రస్తుత సీఎం జగన్..  రాజధాని విషయంలో చేసిన స్టేట్ మెంట్లు రైతులను ఆందోళనకు గురి చేశాయన్నారు. ఎవరి ప్రభుత్వమైన భూములిచ్చిన రైతులకు ధైర్యం చెప్పాలని, అండగా ఉండాలని ఆయన అన్నారు. ఈ విషయంపై  రాజకీయ పార్టీలు , అక్కడి ప్రభుత్వాలు కలసి కూర్చొని చర్చించుకుని సమస్య పరిష్కారం కనుగొనాలని సూచించారు. ఉద్రిక్తమైన, ఆందోళనకరమైన వాతావరణం ఏ రాష్ట్రానికి మంచిది కాదని మంత్రి అన్నారు.

 Amaravati Women Farmers Meet Kishan Reddy at Secunderabad