అమర్నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారు

అమర్నాథ్ యాత్రకు ముహూర్తం ఖరారు

శ్రీనగర్ : దేశంలో అత్యంత పవిత్రమైన శైవ క్షేత్రాల్లో ఒకటి అమర్నాథ్. హిమాలయాల్లో కొలువుదీరే మంచు లింగాన్ని దర్శించుకునేందుకు ఏటా లక్షల మంది భక్తులు తరలివస్తుంటారు. కేవలం కొన్ని రోజులు మాత్రమే దర్శించుకునే అవకాశం ఉండటంతో యాత్రకు ఎప్పుడు అనుమతిస్తారా అని జనం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ క్రమంలో భక్తుల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాది అమర్నాథ్ యాత్రకు సంబంధించిన తేదీలను ప్రకటించారు. జూన్ 30 నుంచి యాత్ర ప్రారంభవుతుందని శ్రీ అమర్నాథ్ జీ దేవస్థానం బోర్డు ప్రకటించింది. 43రోజుల పాటు కొనసాగుతుందని చెప్పింది. ఇవాళ జరిగిన బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ట్విట్టర్లో ట్వీట్ చేశారు. 

2019లో జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన నేపథ్యంలో ఆ ఏడాది అమర్ నాథ్ యాత్ర అర్థాంతరంగా ముగిసింది. కోవిడ్ మహమ్మారి కారణంగా 2020-, 2021లో యాత్రికులను అనుమతించలేదు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈసారి కోవిడ్ నిబంధనలు పాటిస్తూ యాత్ర నిర్వహించాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది.