రిలయన్స్‌ వాటాలు కొంటున్న అమెజాన్

రిలయన్స్‌ వాటాలు కొంటున్న అమెజాన్

రిటైల్‌లో 40 శాతం వాటా కొనే చాన్స్

రెండు కంపెనీల మధ్య జోరుగా చర్చలు
వాటా విలువ రూ.1.5 లక్షల కోట్లు

ముంబై: ముకేశ్‌‌ అంబానీకి చెందిన రిలయన్స్‌‌ రిటైల్‌‌ బిజినెస్‌‌లో వాటాలు కొనుగోలు చేసేందుకు ఆన్‌‌లైన్‌‌ షాపింగ్‌‌ కంపెనీ అమెజాన్‌‌ చర్చలు జరుపుతోందని సంబంధిత వ్యక్తులు చెప్పారు. 20 బిలియన్‌‌ డాలర్ల (దాదాపు రూ.1.5 లక్షలు) విలువైన వాటాను అమెజాన్‌‌కు అమ్మేందుకు రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ అధినేత  రెడీగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వాటా గరిష్టంగా 40 శాతం వరకు ఉండొచ్చని అంచనా. ఈ అంశంపై అమెజాన్‌‌, రిలయన్స్ స్పందించలేదు.  జియో ప్లాట్‌‌ఫామ్స్‌‌లో వాటాను ఫేస్‌‌బుక్‌‌, గూగుల్‌‌ వంటి కంపెనీలకు అమ్మడం ద్వారా 20 బిలియన్‌‌ డాలర్లను (దాదాపు రూ.1.5 లక్షల కోట్లు) అంబానీ ఇప్పటికే  సమీకరించారు. అమెజాన్‌‌తో రిలయన్స్‌‌ ఒప్పందం ఖరారైతే రెండు కంపెనీలూ ప్రయోజనం పొందుతాయని విశ్లేషకులు అంచనావేస్తున్నారు.  రిలయన్స్‌ రిటైల్‌ బిజినెస్‌ను రిలయన్స్‌ రిటైల్‌ వెంచర్స్‌ లిమిటెడ్‌(ఆర్‌‌ఆర్‌‌వీఎల్‌‌) నిర్వహిస్తోంది. ఇది రిలయన్స్‌ రిటైల్‌కు సబ్సిడరీ కంపెనీ. దీనికి దేశవ్యాపంగా 12 వేల స్టోర్లు ఉన్నాయి. ఇవి 64 కోట్ల మందికి సేవలు అందిస్తాయని అంచనా. ఆర్‌‌ఆర్‌‌వీఎల్‌‌లో 1.75 శాతం వాటా కోసం రూ.7,500 కోట్లను ప్రైవేట్‌ ఈక్విటీ కంపెనీ సిల్వర్‌‌ లేక్ ఇన్వెస్ట్‌ చేసింది. ఆర్‌‌ఆర్‌‌వీఎల్‌‌లోకి గ్లోబల్‌‌ ఇన్వెస్టర్లను ఆహ్వానిస్తామని అంబానీ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఫ్యూచర్‌‌‌‌ గ్రూప్‌‌కు చెందిన రిటైల్‌‌, హోల్‌‌సేల్‌‌, లాజిస్టిక్స్‌‌, వేర్‌‌‌‌హౌసింగ్‌‌ బిజినెస్‌‌లను రిలయన్స్‌‌ రిటైల్ రూ. 24,713 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.  దీంతో ఆర్గనైజ్డ్‌‌ రిటైల్‌‌ సెక్టార్‌‌‌‌లో  రిలయన్స్‌‌ రిటైల్‌‌ మార్కెట్‌‌ వాటా అదనంగా 4.1 శాతం పెరిగింది.  కంపెనీ మొత్తం మార్కెట్‌‌ షేర్‌‌‌‌ 17.8 శాతానికి చేరుకుంది.  ఈ కొనుగోలు వల్ల  రిలయన్స్‌‌ రిటైల్‌‌ మరిన్ని సిటీలకు విస్తరించింది. కంపెనీ  వేర్‌‌‌‌ హౌసింగ్‌‌ కెపాసిటీ కూడా పెరిగింది.  ప్రస్తుతం రిలయన్స్‌‌ రిటైల్ వాల్యుయేషన్‌‌ రూ. 4.5 లక్షల కోట్ల వరకు ఉంది.  అమెజాన్‌‌కు ఇప్పటికే ఫ్యూచర్‌‌‌‌ గ్రూప్‌‌లో మైనార్టీ వాటా ఉంది. ఇండియన్‌‌ రిటైల్‌‌ మార్కెట్లో విదేశీ కంపెనీలు తమ వాటాలను పెంచుకోవడంపై లిమిట్స్ ఉన్నాయి. దీంతో అమెజాన్‌‌ తన వాటాను ఫ్యూచర్ గ్రూప్‌‌లో పెంచుకోలేకపోయింది. అందుకే రిలయన్స్‌‌ రిటైల్‌‌లో వాటా కొనేందుకు ప్రయత్నిస్తున్నది.

రిలయన్స్‌‌ మార్కెట్​ వాల్యూ రూ.14 లక్షల కోట్లపైమాటే

రిలయన్స్‌‌ మార్కెట్‌‌ వాల్యూ 200 బిలియన్‌‌ డాలర్ల (సుమారుగా రూ. 15 లక్షల కోట్లు) రికార్డ్‌ లెవెల్‌‌ను తాకింది. ఈ ఘనతను సాధించిన మొదటి ఇండియన్‌‌ కంపెనీగా రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ నిలిచింది. కంపెనీ సబ్సిడరీలలోకి ఇన్వెస్ట్‌‌మెంట్లు వస్తుండడంతో రిలయన్స్‌‌ ఇండస్ట్రీస్‌‌ వాల్యూ భారీగా పెరిగింది. కంపెనీ షేరు గురువారం సెషన్‌‌లో రూ. 2,344.95 వద్ద  ఏడాది గరిష్టాన్ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌‌ క్యాప్‌‌ 199.64  బిలియన్‌‌ డాలర్లకు పెరిగింది. కంపెనీ ఈ ఏడాది ఇష్యూ చేసిన పార్ట్‌‌లీ పెయిడ్‌‌ అప్‌‌ షేర్లు కూడా 8 శాతానికి పైగా పెరిగాయి. దీంతో వీటి మార్కెట్‌‌ క్యాప్‌‌ రూ. 57,815.36 కోట్లకు లేదా 7.82 బిలియన్‌‌ డాలర్లకు ఎగిసింది. ఈ రెండు మార్కెట్‌‌ క్యాప్‌‌లను కలిపితే రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ మొత్తం మార్కెట్‌‌ క్యాప్‌‌ 208 బిలియన్‌‌ డాలర్లను తాకినట్టే. మార్కెట్‌‌ క్యాప్ పరంగా రెండో అతిపెద్ద కంపెనీ టీసీఎస్‌‌(119 బిలియన్‌‌ డాలర్లు) కంటే రిలయన్స్ ఇండస్ట్రీస్‌‌ సుమారుగా రెండు రెట్లు ఎక్కువ కావడం విశేషం. గురువారం సెషన్‌‌లో రిలయన్స్ షేరు 7.29 శాతం పెరిగి రూ. 2,319 వద్ద క్లోజయ్యింది.

For More News..

ఇంట్లో పాత సామాను తీస్తుంటే.. రూ. 95 లక్షల విలువైన మగ్గు దొరికింది

బ్యాన్​ చేసిన​ చైనా యాప్స్​ను అమ్మాల్సిందే!

ముంబైని ఆపతరమా! ఐదో టైటిల్‌‌పై రోహిత్‌ సేన దృష్టి..