వచ్చే వారం 16వేల మందిని లేఆఫ్ చేస్తున్న అమెజాన్.. టార్గెట్ ఆ ఉద్యోగులే..

వచ్చే వారం 16వేల మందిని లేఆఫ్ చేస్తున్న అమెజాన్.. టార్గెట్ ఆ ఉద్యోగులే..

అమెజాన్ లాంటి పెద్ద కంపెనీల్లో పని చేయడమంటే ఒకప్పుడు ఉద్యోగ భద్రతకు కేరాఫ్ అడ్రస్‌గా భావించేవారు యూత్. కానీ ఇప్పుడు అక్కడ మారుతున్న పరిస్థితులు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. గత ఏడాది మాస్ లేఆఫ్స్ తర్వాత.. అమెజాన్ మరో భారీ ఉద్యోగాల తొలగింపునకు సిద్ధమవుతోంది. వచ్చే వారం దాదాపు 16వేల మంది కార్పొరేట్ ఉద్యోగులను ఇంటికి పంపే అవకాశం ఉందని తాజా న్యూస్ రిపోర్ట్స్ ద్వారా వెల్లడైంది.

జస్ట్ కొద్ది నెలల క్రితమే అక్టోబరులో అమెజాన్ 14వేల మంది  ఉద్యోగులను తొలగించింది. దానిని మరచికోక మునుపై ఇప్పుడు మళ్లీ 16వేల మందిపై వేటు వేయాలని నిర్ణయించడంతో ఉద్యోగుల్లో భయాలు పెరిగాయి. అమెజాన్ చరిత్రలో కార్పొరేట్ విభాగంలో ఇంత భారీ స్థాయిలో కోతలు విధించడం ఇదే మొదటిసారి. అమెజాన్ ప్రపంచవ్యాప్తంగా 15 లక్షల మంది సిబ్బందిని కలిగి ఉన్నప్పటికీ.. అందులో ఆఫీసుల్లో పనిచేసే వైట్ కాలర్ కార్పొరేట్ ఉద్యోగులు సుమారు 3.5 లక్షల మంది మాత్రమే. అంటే ఈ లేఆఫ్స్ ప్రభావం కార్పొరేట్ టీమ్స్‌పై చాలా తీవ్రంగా ఉండబోతోంది.

తొలగింపుల వెనుక అసలు కారణమేంటి..?
సాధారణంగా కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి లేదా ఏఐ వల్ల పాత ఉద్యోగాలు అవసరం లేదని తొలగింపులు చేపడతాయి. అయితే అమెజాన్ సీఈఓ ఆండీ జస్సీ వివరణ భిన్నంగా ఉంది. ఈ కోతలు కేవలం ఖర్చుల తగ్గింపు కోసం కాదని, కంపెనీ మారుతున్న వర్క్ కల్చర్ కి అనుగుణంగా లేని రోల్స్‌ను తొలగిస్తున్నామని చెబుతున్నారు. 'కల్చరల్ ఫిట్' అంటే కంపెనీ అంచనాలకు తగ్గట్టుగా ఉద్యోగులు మారుతున్నారా లేదా అన్న కోణంలో ఈ నిర్ణయాలు తీసుకుంటున్నట్లు చెప్పడం చర్చనీయాంశంగా మారింది.

ఎవరిపై ఎఫెక్ట్ ఎక్కువ..?
ఈ తాజా తొలగింపుల ప్రభావం ప్రధానంగా కార్పొరేట్, మేనేజ్‌మెంట్ విభాగాలపై ఉండనుంది. కంపెనీ తన అంతర్గత వర్క్ వ్యవస్థలను  స్ట్రీమ్‌లైన్ చేసే క్రమంలో ఉంది. అంటే ఒక పని కోసం ఎక్కువ మంది మేనేజర్లు, ఎక్కువ లేయర్స్ ఉన్న చోట భారీ కోతలు ఉండవచ్చు. ఈసారి కూడా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్, మార్కెటింగ్, మానవ వనరుల విభాగాల్లోని మధ్యస్థ స్థాయి ఉద్యోగులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని సమాచారం. 

మహమ్మారి సమయంలో విచ్చలవిడిగా నియామకాలు చేసుకున్న టెక్ కంపెనీలు.. ఇప్పుడు ఆర్థిక మందగమనం, ఇన్వెస్టర్ల ఒత్తిడి కారణంగా వెనక్కి తగ్గుతున్నాయి. అమెజాన్ అధికారికంగా ఇంకా స్పందించకపోయినప్పటికీ.. వచ్చే వారం నుండి ఈ తొలగింపుల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉందని వార్తలు రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. తమ నమ్మకాన్ని అమెజాన్ ఎలా తిరిగి నిలబెట్టుకుంటుంది? ఈ భారీ కోతల తర్వాత సంస్థ ఏ దిశగా వెళ్తుంది? అన్న ప్రశ్నలు ఇప్పుడు జవాబు కోసం ఎదురుచూస్తున్నాయి.