అమెజాన్‌లో మళ్లీ కోత మొదలైంది.. ఈ సారి 500మందికి ఎసరు

అమెజాన్‌లో మళ్లీ కోత మొదలైంది.. ఈ సారి 500మందికి ఎసరు

ఆర్థిక మాంద్యం భయంతో ఇప్పటికే సుమారు 18వేలకు పైగా ఉద్యోగులను వదిలించుకున్న అమెజాన్.. మరోసారి లేఆఫ్స్ కు సిద్ధమైంది. ఇండియాలో వివిధ విభాగాల్లో పని చేస్తోన్న ఉద్యోగుల్లో 500మందిని తీసివేసే అవకాశం ఉందని అమెజాన్ తాజాగా వెల్లడించింది. రెండో విడత ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను మార్చి నెలలోనే ప్రకటించిన కంపెనీ సీఈవో యాండీ జెస్సీ.. ప్రపంచ వ్యాప్తంగా 9వేల మందిని తొలగిస్తున్నట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో మరింత అస్థిరత నెలకొనే అవకాశం ఉండడంతో కంపెనీపై ఆర్థిక భారం తగ్గించుకోవాలని భావిస్తున్నట్టు యాండీ స్పష్టం చేశారు. వచ్చే నెలలో అంటే ఏప్రిల్ నెల నుంచి ఈ తొలగింపు ప్రక్రియ చేపడతామని తెలిపారు. త్వరలోనే దీనికి సంబంధించిన సమాచారాన్ని ఉద్యోగులకు చేరవేస్తామని చెప్పారు. వీరిలో వెబ్ సర్వీసెస్, హ్యూమన్ రిసోర్సెస్, సపోర్ట్ డిపార్ట్‌మెంట్లకు చెందిన ఉద్యోగులు ఉండవచ్చని కొన్ని మీడియాలు కథనాలు ప్రచురించారు.

గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజాల భారీ తొలగింపుల ఫలితంగా గత ఆరు నెలల్లోనే వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. గోల్డ్‌మ్యాన్ సాచ్స్, అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా, ట్విట్టర్ వంటి కంపెనీలు ఇటీవల ఉద్యోగులను తొలగించాయి. వినియోగదారుల వ్యయం, అధిక వడ్డీ రేట్లు, పెరుగుతున్న ప్రపంచ ద్రవ్యోల్బణం కారణంగా ఉద్యోగులను తీసుకోవడం కూడా కంపెనీలు ఆపివేసాయి.