
హైదరాబాద్: డొమెస్టిక్ క్రికెట్లో హైదరాబాద్ టీమ్ తరఫున రాణించడమే తన ప్రధాన లక్ష్యమని ఇండియన్ క్రికెటర్ అంబటి రాయుడు అన్నాడు. రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోవడాన్ని యూ టర్న్‌గా భావించొద్దన్నాడు. విదేశీ లీగ్‌ల్లో ఆడితే కళ్లు చెదిరే స్థాయిలో డబ్బులు ఇస్తామని ఆఫర్ ఇచ్చినా వదులుకున్నానని చెప్పాడు. ‘కెనడా, ఇతర దేశాల్లో టీ10, టీ20 లీగ్‌ల్లో ఆడితే పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తామన్నారు. నా శ్రేయోభిలాషుల కోరిక మేరకే నేను రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నా. దీనిని యూ టర్న్‌గా కాకుండా నేను తీసుకున్న మంచి నిర్ణయంగా భావించాలి. మరో ఐదేళ్లు ఆడాలనుకుంటున్నా’ అని రాయుడు పేర్కొన్నాడు.
లక్ష్మణ్, నోయల్ వల్లే…
మరోవైపు లెజెండ్ వీవీఎస్ లక్ష్మణ్, నోయల్ డేవిడ్ వల్లే రాయుడు రిటైర్మెంట్ వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. ‘రాయుడు వయసు 33 ఏళ్లే. ఇంకా ఐదేళ్లు క్రికెట్ ఆడే సత్తా అతనిలో ఉంది. వరల్డ్‌కప్ వ్యవహారం దురదృష్టకర ఘటన. దానిని అధిగమించాలి. నేను, లక్ష్మణ్ రిటైర్మెంట్ నిర్ణయం మార్చుకోమని చెప్పాం. ముందుగా స్టేట్ టీమ్‌కు ఆడి ఆ తర్వాత టీమిండియా గురించి ఆలోచించమని చెప్పాం. మొత్తానికి మా మాట విన్నాడు. రాయుడు అనుభవం యువకులకు చాలా అవసరం’ అని హెచ్‌సీఏ సెలెక్టర్‌గా పని చేస్తున్న నోయల్ డేవిడ్ వివరించాడు.