ఇంటర్ విద్యార్థులకు సరోజా వివేక్ అభినందన

ఇంటర్ విద్యార్థులకు సరోజా వివేక్ అభినందన
  • విద్యార్థులను అభినందించిన కరస్పాండెంట్ సరోజా వివేక్
  • ఫస్టియర్​ఎంపీసీలో టి.సాయినాథ్​కు 466, కె.ధీరజ్​ 465 మార్కులు
  • ఫస్టియర్​ బైపీసీలో రమ్యకు 426, గాయత్రికి 417 మార్కులు

పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా హైదరాబాద్​ బాగ్​లింగంపల్లిలో కేంద్ర మాజీ మంత్రి జి.వెంకటస్వామి (కాకా) 1973లో డాక్టర్​ బి.ఆర్​. అంబేద్కర్​ విద్యా సంస్థలను స్థాపించారు. ప్రస్తుతం ఇందులో స్కూల్​, జూనియర్​ కాలేజీ, డిగ్రీ కాలేజీ, లా కాలేజీ, ఎంబీఏ కాలేజీలు ఉన్నాయి. 

ముషీరాబాద్, వెలుగు: ఇంటర్మీడియట్​ ఫలితాల్లో హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని డాక్టర్​ బీఆర్​ అంబేద్కర్ విద్యాసంస్థల విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా టాప్ లో నిలిచారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ఇక్కడి ఎంపీసీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్లు టి.సాయినాథ్ 466 మార్కులు, కె.ధీరజ్ 465 మార్కులు, సి.ఆదిత్య 461 మార్కులు, పవన్ కుమార్ 460 మార్కులు, బైపీసీ ఫస్ట్​ ఇయర్​ స్టూడెంట్లు  పి.రమ్య 426 మార్కులు, ఎం.గాయత్రి 417 మార్కులు సాధించారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బుధవారం అంబేద్కర్  కాలేజీ మెయిన్ హాల్​లో సత్కార కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమానికి విద్యాసంస్థల  కరస్పాండెంట్ సరోజా వివేక్ హాజరై.. విద్యార్థులను అభినందించి, నగదు బహుమతులు అందజేశారు. అనంతరం సరోజా వివేక్ మాట్లాడుతూ.. ప్రతి ఒక్క విద్యార్థికి క్రమశిక్షణ చాలా అవసరమన్నారు. చదువు ఉంటే ఏదైనా సాధించగలమనే నమ్మకం, ధైర్యం ఏర్పడుతుందని పేర్కొన్నారు. పట్టుదలతో చదివితే ప్రతి ఒక్కరికీ మంచి మార్కులు రావడంతో పాటు ఎన్నో విజయాలు సాధిస్తారని, అందుకు ప్రతి ఒక్క విద్యార్థి కృషి చేయాలని సూచించారు. ఇంటర్ ఫలితాల్లో ప్రైవేట్ కాలేజీలకు దీటుగా అంబేద్కర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన స్థానాలు సాధించారని అభినందించారు.

కాలేజీలో చదివే పేద విద్యార్థులు టాపర్లుగా నిలవడం సంతోషకరమని సరోజా వివేక్​ అన్నారు. జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వసుంధర మాట్లాడుతూ.. ఫ్యాకల్టీ ప్రతి ఒక్కరు కష్టపడి షార్ట్ నోట్స్ తయారు చేసి విద్యార్థులకు అందించడం, విద్యార్థులు ఎక్కువ సమయం కేటాయించి చదవడం వల్లనే మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు స్టేట్ లెవెల్ ర్యాంకులు సాధించడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విద్యాసంస్థల డైరెక్టర్ రామకృష్ణ మోహన్ రావు మాట్లాడుతూ.. కాలేజీలో చదివే చాలా మంది పేద కుటుంబానికి చెందిన పిల్లలు మంచి మార్క్స్ తెచ్చుకోవడం, నలుగురు స్టేట్ లెవెల్ మార్కులు తెచ్చుకోవడం గర్వకారణమన్నారు.  

మా అమ్మ అటెండర్.. ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్.. ఎక్స్ ట్రా తరగతుల వల్లే..

మా అమ్మ అటెండర్. కాలేజీ ఫ్యాకల్టీ ఇచ్చిన నోట్స్, ఎక్స్ట్రా తరగతుల వల్లనే బాగా చదువగలిగాను. స్టేట్ లెవెల్ విజయం సాధించినందుకు సంతోషంగా ఉంది. - పవన్ కుమార్, ఫస్టియర్​ ఎంపీసీ (మార్కులు: 460/470)

మా నాన్న ఆటో డ్రైవర్.. ఫ్యాకల్టీ సపోర్ట్ తోనే..

మా నాన్న ఆటో డ్రైవర్. మాకు ఇక్కడ కాలేజీలో తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్య అందిస్తున్నారు. ఫ్యాకల్టీ ఫుల్ సపోర్ట్ చేయడం వల్లనే ఈ విజయం సాధ్యమైంది. - రమ్య, ఫస్టియర్​ బైపీసీ (మార్కులు: 426/440)

చాలా సంతోషంగా ఉంది
మా నాన్న ఆటో డ్రైవర్​. అంబేద్కర్​ కాలేజీ యాజమాన్యం, ఫ్యాకల్టీ వాళ్లు నన్ను ఎంతో ప్రోత్సహించారు. వారు స్టడీ మెటీరియల్ ఇవ్వడంతోపాటు ఎక్కువ టైం కేటాయించి, ఎక్స్ట్రా తరగతులు నిర్వహించడం వల్లనే ఈ విజయం సాధించాను. సంతోషంగా ఉంది. - సాయినాథ్, ఫస్టియర్​ ఎంపీసీ (మార్కులు: 466/470)

మా అమ్మ పని మనిషి.. అంబేద్కర్ కాలేజీ నన్ను ఆదుకుంది
మా అమ్మ ఇండ్లలో పని చేస్తుంది. సంపాదన అంతంత మాత్రమే. అంబేద్కర్ కాలేజీ నన్ను ఆదుకుంది. కాలేజీ యాజమాన్యం, ఫ్యాకల్టీ వారు ఇచ్చిన సూచనలు, మెటీరియల్ తో మంచి మార్కులు తెచ్చుకున్నాను. 
- ధీరజ్, ఫస్టియర్ ఎంపీసీ (మార్కులు: 465/470)

కాలేజీతోపాటు ఇంటిదగ్గర.. రోజుకు 16 గంటలు చదవడం వల్లే..
మా నాన్న చిన్నపాటి ఉద్యోగి. కాలేజీతో పాటు ఇంటి వద్ద సుమారు 16 గంటలు చదువుకోవడంతో ఈ విజయం సాధించగలిగాను. అంబేద్కర్ కాలేజీలో విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి. 
- ఆదిత్య, ఫస్టియర్​ ఎంపీసీ (మార్కులు: 461/470)

డబ్బుల్లేక చదువు ఆపేద్దామనుకున్నా..
మొదట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు వద్దనుకున్న. కానీ, అంబేద్కర్​ కాలేజీ నాకు విద్యను అందించింది. ఇంటర్ ఫస్టియర్​లో ఈ విజయం సాధించినందుకు ఆనందంగా ఉంది. - గాయత్రి, ఫస్టియర్​ బైపీసీ  (మార్కులు 417/440)