అంబేద్కర్ పేరు తీసేసి.. ప్రాజెక్టునే ముంచారు

అంబేద్కర్ పేరు తీసేసి.. ప్రాజెక్టునే ముంచారు

కాం గ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కాళేశ్వరం అవినీతిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టుకు  సీనియర్​ కాంగ్రెస్​ నాయకులు సూదిని జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని ప్రభుత్వం యోచన చేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. అది మంచి పరిణామమే. ఎందుకంటే, నల్గొండలో జన్మించి మహబూబ్​ నగర్​లో పెరిగి రంగారెడ్డిలో రాజకీయం చేసి దేశమంతా పేరుపొందిన నేత జైపాల్​రెడ్డి. అటువంటి కీలక నేత పేరు ఒక ప్రాజెక్టుకు పెట్టడం సబబే. అయితే, ప్రాజెక్టుల విషయంలో రాద్ధాంతం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా ప్రాణహిత– చేవెళ్ల ప్రాజెక్టుకు భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్​ బీఆర్ అంబేద్కర్​ పేరు మార్చిన మాట వాస్తవం కాదా? సమాధానం చెప్పాలి. 

అప్పుడు అంత గొప్ప నేత పేరు మార్చి ఇప్పుడు బీఆర్ఎస్​కపట నాటకం ఆడటం దారుణం. తుమ్మిడిహెట్టి నుంచి సుస్థిరమైన గ్రావిటీ ప్రధాన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం ఐరావతం వంటి ఖర్చును పెంచి మేడిగడ్డకు మార్చింది. ప్రాణహిత– చేవెళ్ళ సుజల స్రవంతికి పెట్టిన 'అంబేద్కర్' పేరును రద్దు చేస్తున్నామని చెప్పకుండానే కాళేశ్వరం ప్రాజెక్టుగా మార్చి రద్దు చేసింది. ఇదంతా అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాలు శిఖర స్థాయిలో జరుగుతున్న సమయంలో చల్లగా జరిగిపోయింది. మరోపక్క 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నగరంలో నెలకొల్పుతున్న సమయంలోనే అంబేద్కర్ పేరు తొలగించడమూ కాళేశ్వరం పేరు ప్రకటించడమూ చకచకా జరిగిపోయాయి. 

రూ.కోట్ల  ప్రజాధనం వృథా

అంబేద్కర్ పేరిట రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, నల్గొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాలకు సాగునీరుతో పాటు హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు అందించాలని ఈ పథకం లక్ష్యం. కానీ, తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ప్రధాన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి, ప్రాణహిత ప్రాజెక్టు ప్రాణాన్ని, తెలంగాణ ఆర్థిక వ్యవస్థ జీవాన్ని తీసేశారు. రెండు జిల్లాలకు మినహాయించి రాష్ట్రానికంతటికి సాగునీరు అందించే లక్ష్యం గతంలో ఉంది. ప్రాణహిత గ్రావిటీ ప్రధాన ప్రాజెక్టును మేడిగడ్డకు మార్చి ఎత్తిపోతలు చేయడం వల్ల ప్రతి ఎకరా కాపిటల్ కాస్ట్ ఐదు, ఆరు లక్షలు దాటుతుందని ప్రముఖ నీటిపారుదల నిపుణులు అంటున్నారు. నిర్వహణ వ్యయం ఏటా ప్రతి ఎకరాకు రూ. 65 వేలు దాటి తడిసి మోపెడు అవుతుంది. పాత ప్రాణహిత రూ. 38,500 కోట్ల పథకాన్ని ఏకంగా 83 వేల కోట్ల పథకంగా మార్చడం వల్ల 20 వేల కోట్ల ప్రజాధనం వృథా అవుతుందని.. ప్రఖ్యాత నీటిపారుదల నివుణుడు కీర్తిశేషులు. టి. హనుమంతరావు అన్ని పార్టీలు నిర్వహించిన సమావేశపు ప్రజెంటేషన్ లో గతంలోనే వెల్లడించాడు. ఈ రీడిజైన్ ద్వారా నీళ్లు బీళ్లకొస్తాయో లేదో తెలియదుకానీ నిధులు చేరాల్సిన వాళ్లకు చేరతాయని అర్థమవుతూనే ఉంది.  నిపుణులు చెబుతున్నా వినకుండా మేడిగడ్డ వంటి పనికిరాని ఎత్తిపోతలను తెలంగాణ తలపై ఎత్తడమెందుకు?.

వృథా ఖర్చును  నివారించాలి

ఎత్తిపోతలతో అంబేద్కర్ ప్రాణహిత సుజల స్రవంతి ద్వారా అందించే సాగునీరు బడుగు, బలహీన వర్గాల భూములకు అందుతాయో లేదో  తెలియని అయోమయ పరిస్థితులు  రీడిజైనింగ్​తో  నెలకొన్నాయి. అంబేద్కర్ రాజ్యాంగం ఆవిష్కరించి దశాబ్దాలు గడిచినా దళితులు, గిరిజనులు, కష్టజీవుల జీవిత బాధలకు నేటికీ విముక్తి లభించనే లేదు.  గతంలో ప్రఖ్యాత ఇంజినీర్ హనుమంతరావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రాణహిత– చేవెళ్ల, కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణాల్లోని రీడిజైన్లలో కొన్ని సుస్థిరమైన ప్రత్యామ్నాయాలను అమలుచేస్తే ప్రభుత్వం అంచనా ఖర్చులో రూ. 20 వేల కోట్లు ఆదా చేయవచ్చని అఖిలపక్ష సభలో ప్రకటించారు. ఈ 20 వేల కోట్లను ఆదా చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నించాలి. రీడిజైన్​తో  వ్యర్థంగా పెట్టే ఆ రూ.20 వేల కోట్ల ప్రజాధనపు ఖర్చును నివారించి, ఆ వేల కోట్ల డబ్బును అభాగ్యజీవుల జీవితోద్ధరణకు  వినియోగించడమే అంబేద్కర్​కు నిజమైన నివాళి.

 ప్రాజెక్టుకు ‘అంబేద్కర్’ పేరు పెట్టించింది కాకా వెంకటస్వామి

అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల సుజల స్రవంతి పథకం ద్వారా తెలంగాణలోని 7 జిల్లాలకు సాగునీరు, హైదరాబాద్ నగరానికి తాగునీరు, దారి పొడవునా గ్రామాలకు, హైదరాబాద్ పారిశ్రామిక అవసరాలకు నీరు అందించే లక్ష్యంతో 2008లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం  శంకుస్థాపన చేసింది.  మొదటగా  కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత– చేవెళ్ల అని నామకరణం చేసిన తర్వాత  ఆరాధ్యుడైన అంబేద్కర్ ప్రాణహిత– చేవెళ్ల సుజల స్రవంతి అని  పేరును పెట్టమని ఆనాటి సీనియర్ కాంగ్రెస్ నేత కాకా జి. వెంకటస్వామి నాటి సీఎం రాజశేఖర్ రెడ్డిని కోరడం జరిగింది. దీంతో వెంటనే ఆ ప్రాజెక్టు పేరు అంబేద్కర్ ప్రాణహిత – చేవెళ్ల అని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పేరు పెట్టారు. తెలంగాణ రాష్ట్రం సాకారమై అధికారంలోకి వచ్చిన గత బీఆర్ఎస్​ ప్రభుత్వం చేపట్టిన పనుల కొనసాగింపుగా రూ.1500 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం రూపొందించిన పథకానికి ఎలాంటి మార్పులూ లేకుండా జాతీయ హోదా ఇవ్వాలని 6, 7 నెలల పాటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని  బీఆర్ఎస్ ​సర్కారు కోరింది. కానీ, ఏ చీకటి కుట్రలు జరిగాయో కాని మేడిగడ్డకు ప్రధాన ప్రాజెక్టును మార్చుతూ గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంబేద్కర్​ పేరు పక్కకు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టుగా నామకరణం చేసింది. ‘ప్రాణహిత– చేవెళ్ల బోగస్’ అంటున్న కేసీఆర్ తెలంగాణ ఉద్యమకాలంలో ఒక్కసారి కూడా ప్రాణహిత ప్రాజెక్టు గురించి ప్రస్తావించలేదనేది అతి ముఖ్యమైన అంశం.

అంబేద్కర్​ను అవమానించిన బీఆర్ఎస్​

అంబేద్కర్ ప్రాణహిత- చేవెళ్ల సుజల స్రవంతికి కీలకమైన తుమ్మిడిహెట్టిని నామమాత్రం చేసి, ఆ పేరును రద్దు చేస్తున్నామని ప్రకటించకుండానే పథకం పేరు కాళేశ్వరంగా మార్చడం అంటే అంబేద్కర్​ను అవమానించడమే. సుస్థిరమైన తుమ్మిడిహెట్టి అంబేద్కర్ గ్రావిటీ ప్రాజెక్టును బొందపెట్టి,  ఐరావతం వంటి మేడిగడ్డ ఎత్తిపోతలను ఎత్తుకోవడమంటే.. ఆ మహనీయుడి రాజ్యాంగ పుణ్యంతో వెలిసిన తెలంగాణ రాష్ట్ర బడుగు జనుల బీడు భూములకు నీళ్లు అందకుండా చేయడమే.  పూర్తి గ్రావిటీ ద్వారా తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లి వరకు సుస్థిరంగా నీళ్లు చేర్చి ఎంతో మేలుచేసే జీవనోద్ధరణ పథకాన్ని రద్దు చేసి, అస్థిరమైన ఉత్త ఎత్తిపోతల భారీ పథకాన్ని చేపట్టడం అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చడమవుతుందా? 75 ఏండ్ల స్వతంత్ర భారతావనిలో దోచుకున్న అపార సంపద  దేశ సరిహద్దులు దాటుతోంది. వివక్ష, అసమానతలు లేని సమానత్వాన్ని సృష్టించేందుకు అంబేద్కర్​ మళ్లీ జన్మించాల్సిన ఆవశ్యకత ఉందని అనిపిస్తోంది.

- మ‌‌న్నారం నాగ‌‌రాజు,పొలిటికల్, సోషల్​ ఎనలిస్ట్​