
పార్లమెంట్ లో ఈ అంశం ప్రస్తావించాలి
అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు పరశురాం
బండి సంజయ్, వివేక్ వెంకటస్వామిలకు వినతిపత్రం అందజేత
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటో లేకుండా కరెన్సీ నోటు ఉండటం చరిత్రను వక్రీకరించడమేనని అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాం అన్నారు. ఈ అంశాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామిలకు బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలని కోరుతూ పల్లె నుంచి ఢిల్లీ దాకా నవంబర్ 26 నుంచి ఏప్రిల్ 14 వరకు ప్రజాచైతన్య యాత్ర నిర్వహిస్తామన్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని జనగామ నుంచి దేశవ్యాప్తంగా ఈ యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ‘‘1949లో ఆర్బీఐని జాతీయం చేయాలన్న ఆలోచన అంబేద్కర్‌ది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం తీసుకువచ్చింది అంబేద్కర్. అంతటి మహనీయుని ఫోటో లేకుండా ఆర్బీఐ కరెన్సీ నోటు ముద్రించడం దౌర్భాగ్యం” అని చెప్పారు. పార్లమెంటులో చట్టం తీసుకువచ్చి కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించేలా ఎంపీలు చొరవ చూపాలన్నారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని 2021 ఏప్రిల్ 14లోపు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు.
నాగేశ్వర్ రావు, పరశురాములు, రాజశేఖర్, శ్రీకాంత్ పాల్గొన్నారు.