చిరు వ్యాపారుల టీవీఎస్ ఎక్సెల్లు చోరీ

చిరు వ్యాపారుల టీవీఎస్ ఎక్సెల్లు చోరీ
  • ముగ్గురు నిందితులు అరెస్ట్​
  • 19 వాహనాలు స్వాధీనం

అంబర్​పేట్, వెలుగు: చిరు వ్యాపారుల టీవీఎస్​ఎక్సెల్​వాహనాలను చోరీ చేస్తున్న ముగ్గురిని అంబర్​పేట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి మంగళవారం వెల్లడించారు. గత అక్టోబర్ 7న అంబర్​పేట ప్రేమ్​నగర్​కు చెందిన గుల్ శెట్టి రాజశేఖర్ తన టీవీఎస్ ఎక్సెల్ చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసులో  సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించారు. లాల్ దర్వాజ ఛత్రినాకకు చెందిన షకత్వారి శ్రవణ్ అల్లం, ఎల్లిగడ్డల వ్యాపారం చేస్తుంటాడు. గతంలో అఫ్టల్​గంజ్, బాలానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనం కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. తర్వాత తన మొదటి భార్య పింకీకి విడాకులిచ్చి శాంతిని రెండో పెళ్లి చేసుకున్నాడు.

 ఉప్పల్ బీరప్పగడ్డలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి బోడుప్పల్, అంబర్​పేట, ఉప్పల్ తదితర ప్రాంతాల్లో కూరగాయల వ్యాపారం చేస్తున్న బీబీనగర్​కు చెందిన కాలియా రాజు, మేడ్చల్​కు చెందిన షకత్ ముకేందర్లతో స్నేహం ఏర్పడింది. సులభంగా డబ్బు సంపాదించేందుకు ప్లాన్​వేశారు. టీవీఎస్​ఎక్సెల్​వాహనాలైతే బాధితులు ఫిర్యాదు చేయరని,ఈజీగా చోరీ చేయవచ్చని అనుకున్నారు. అంబర్​పేట్​పోలీసే స్టేషన్ పరిధిలో ఒకటి, కాచిగూడలో ఒకటి, ఛత్రినాకలో ఒకటి, ఉప్పల్​లో 9, నేరేడ్​మెట్​లో 2, శామీర్​పేట 2, అల్వాల్ పీఎస్ పరిధిలో 1, కుషాయిగూడలో 2 వాహనాలను దొంగిలించారు. సీసీ ఫుటేజీలను పరిశీలించడంతోపాటు విశ్వసనీయ సమాచారం మేరకు ఈ ముగ్గురినీ పోలీసులు అరెస్ట్​చేశారు.