
- రూ.1.5 లక్షలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన మధ్యవర్తి
- అంబర్ పేట ఆర్‌ఐ అరెస్ట్ పరారీలో సర్వేయర్
హైదరాబాద్,వెలుగు: ప్లాట్ సర్వే, రిజిస్ట్రేషన్‌కు రూ.10 లక్షల లంచం డిమాండ్ చేసి ఓ ప్రైవేట్ వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టుకుని రూ.1.5 లక్షలు తీసుకుంటూ అంబర్‌పేట్ తహసీల్దార్ ఆఫీస్ సిబ్బంది ఏసీబీకి మంగళవారం రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. అంబర్‌పేట్‌కు చెందిన దడువాయి వెంకటేశ్వరరావు తన తల్లి పేరుతో ఉన్న ప్లాట్ సర్వే, రిజిస్ట్రేషన్ కు తహసీల్దార్ ఆఫీసులో దరఖాస్తు చేశాడు. ఆ ఫైల్ ను సర్వేయర్ డి. లలిత, ఆర్‌ఐ పి.శోభ తమ వద్ద పెండింగ్‌లో పెట్టుకుని, ప్లాట్‌ను సర్వే చేసి, రిజిస్ట్రేషన్ వ్యాల్యూతో డాక్యుమెంట్లు తయారు చేసి ఇచ్చేందుకు రూ.10 లక్షలు లంచం డిమాండ్ చేశారు.
తాము అడిగిన డబ్బు ఇస్తేనే ప్లాట్ రిజిస్ట్రేషన్ విలువను రూ.80 లక్షల నుంచి రూ.60 లక్షలకు తగ్గిస్తామని వారు చెప్పారు. దీంతో బాధితుడు వెంకటేశ్వరరావు మూడు విడతలుగా డబ్బు ఇస్తానని ఒప్పందం చేసుకుని, మరోవైపు ఏసీబీని ఆశ్రయించాడు. మొదటి విడతగా రూ.1.5 లక్షలను ప్రైవేటు వ్యక్తి బాపు యాదవ్‌కు అందించాలని రెవెన్యూ సిబ్బంది చెప్పారు. మంగళవారం బాధితుడు బాపు యాదవ్ ను కలిసి డబ్బు అందిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు ఆర్ఐ శోభను ఆఫీసులోనే అరెస్ట్ చేశారు. సర్వేయర్ లలిత పరారీలో ఉంది. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే 1094 టోల్ ఫ్రీ కి కాల్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.