
- రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై సందిగ్ధం
- ఇప్పటికే రెండుసార్లు మునుగోడులో పర్యటించిన కేటీఆర్
- చండూరు గురించి ప్రస్తావన రాకపోవడంతో అయోమయం
నల్గొండ, వెలుగు : మునుగోడు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన చండూరు రెవెన్యూ డివిజన్‌పై సందిగ్ధత నెలకొంది. ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిస్తే కొత్తగా చండూరు డివిజన్ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ఎన్నికల ప్రచార సభలో హామీ ఇచ్చారు. దీంతోపాటు నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతామని చెప్పారు. నియోజకవర్గ అభివృద్ధి గురించి డిసెంబర్లో మునుగోడులో కేటీఆర్ఆధ్వర్యంలో ఐదుగురు మంత్రుల బృందం సమీక్ష చేసి రూ.400 కోట్లు ప్రకటించింది. కానీ చండూరు డివిజన్ గురించి మాత్రం ప్రస్తావించలేదు. మళ్లీ ఇటీవల చండూరు, గట్టుప్పుల్ మండలాల్లో కేటీఆర్పర్యటన సాగింది. డిసెంబర్లో హామీ ఇచ్చిన అభివృద్ధి పనులకు మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. ఇంకా మిగిలిపోయిన హామీలు ఏమైనా ఉంటే నెరవేరుస్తామని ఇదే సభలో కేటీఆర్ స్పష్టం చేశారు. కానీ చండూరు డివిజన్ గురించి ఎలాంటి ప్రస్తావన తేలేదు. మర్రిగూడ, చౌటుప్పుల్‌లో పర్య టించిన ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు కూడా చండూరు గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. త్వరలో చండూరులో వందపడకల ఆసుపత్రి ఏర్పాటు చేస్తామని మాత్రం చెప్పారు. పురపాలక శాఖ మంత్రి హోదాలో మంత్రి కేటీఆర్ రెండుసార్లు పర్యటించినప్పటికీ చండూరు గురించి ప్రస్తావించకపో వడం పట్ల పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇటీవల జరిగిన కేటీఆర్ పర్యటనలో చండూరు ప్రస్తావన కచ్చితంగా ఉండొచ్చని అధికారులు సైతం భావించారు. అందుకు సంబంధించిన ప్రాథమిక కసరత్తు కూడా చేశారు. కానీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోవడంతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
నాంపల్లిలో ఏర్పాటుకు ప్రతిపాదన
చండూరు, మునుగోడు మండలాలు ఇప్పటికే నల్గొండ డివిజన్ పరిధిలో ఉన్నందున కొత్త డివిజన్ నాంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. మండలంలోని పలువురు ప్రజాప్రతినిధులు ఇప్పటికే వారి అభిప్రాయాన్ని పార్టీ పెద్దలకు తెలిపారు. పాత తాలూక కేంద్రమైన నాంపల్లిలోనే ప్రస్తుతం సివిల్, ఎక్సైజ్సర్కిల్పోలీస్స్టేషన్లు, ఎస్టీఓ, విద్యుత్ డీఈ ఆఫీసులు ఉన్నాయి. ఇక్కడే జూనియర్‌సివిల్‌జడ్జి కోర్టు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీంతో నాంపల్లి మండల కేంద్రాన్ని డివిజన్ కేంద్రంగా మారిస్తే దేవరకొండ డివిజన్‌తో ఇబ్బంది పడుతున్న గుర్రంపోడు మండలంతోపాటు, మర్రిగూడ, చండూరు మండలాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. చండూరు డివిజన్ వల్ల నాంపల్లి మండలంలోని ముష్టిపల్లి, దేవత్‌పల్లి, రాజాతండా, రేక్యాతండా, రేవెల్లి, మునుగోడు మండలంలోని గూడాపూర్, కల్వలపల్లితోపాటు మరో రెండు, మూడు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారు. ఈ గ్రామాలు నల్గొండ డివిజన్‌కు సమీపంలో ఉన్నాయి. భౌగోళికంగా ప్రజలకు అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండేలా డివిజన్ ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గట్టుప్పుల్ మండల తరహాలో మరీ ఆలస్యం చేయకుండా ఇచ్చిన హామీని త్వరగా నెరవేర్చాలనే డిమాండ్ కూడా అధికార పార్టీ నేతల నుంచి వినిపిస్తోంది.
ఒకే నియోజకవర్గంలో రెండు ఎట్లా?
ఒకే నియోజకవర్గంలో రెండు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై చర్చ జరుగుతున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణ్‌పూర్, చౌటుప్పల్మండలాలకు కలిపి యాదాద్రి జిల్లా పరిధిలో చౌటుప్పుల్ రెవెన్యూ డివిజన్ ఉంది. మర్రిగూడ, నాంపల్లి మండలాలు దేవరకొండ డివిజన్ పరిధిలో ఉన్నాయి. మునుగోడు, చండూరు, గట్టుప్పుల్ మండలాలు నల్గొండ డివిజన్ పరిధిలో ఉన్నాయి. అయితే కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలనుకుంటే చండూరు కేంద్రంగా ఏర్పాటు చేయాలా.. లేదంటే నాంపల్లి కేంద్రంగా చేస్తే ఎలా ఉంటుందనే కోణంలో చర్చ జరుగుతోంది. ఎక్కడ ఏర్పాటు చేస్తే ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందనే దానిపై కసరత్తు జరుగుతున్నట్లు తెలిసింది.