
ఎల్బీనగర్, వెలుగు: 102 వెహికల్‌కు ఓ ఇన్నోవా కారు అడ్డుగా వచ్చింది.. దారి ఇవ్వమని డ్రైవర్ అడిగితే ఆ కారులో ఉన్న ఇద్దరు యువకులు అతనిపై దాడి చేశారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించి హంగామా సృష్టించారు. వనస్థలిపురం ఇన్స్పెక్టర్ మహేశ్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ గ్రామానికి చెందిన కొర్ని యాదయ్య 102 వాహన డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గురువారం రాత్రి 9 గంటలకు కోఠి మెటర్నటీ హాస్పిటల్నుంచి ఓ బాలింతను రంగారెడ్డి జిల్లా మాడ్గుల గ్రామానికి తీసుకెళ్తున్నాడు.
వాహనం వనస్థలిపురం బీఎన్‌రెడ్డి నగర్వద్దకు రాగానే.. ఇన్నోవా కారు అడ్డుగా వచ్చి ఆగింది. దారి ఇవ్వాలని యాదయ్య అడగడంతో కారులో ఉన్న ఇద్దరు యువకులు వచ్చి, అతనిన కిందికి లాగి చితకబాదారు. అంబులెన్స్‌లో బాలింత ఉందని స్థానికులు, వాహనదారులు చెప్పినా వారు వినలేదు. డ్రైవర్ తమ కాళ్లు మొక్కితేనే వదిలేస్తామని అరగంటపాటు హంగామా చేశారు. ట్రాఫిక్‌లో అందరూ చూస్తుండగానే ప్రైవేట్ పార్ట్స్ చూపుతూ వికృత చేష్టలకు పాల్పడ్డారు. అక్కడున్నవారు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్అయింది.
డ్రైవర్ యాదయ్య ఫిర్యాదుతో పోలీసులు ఆ యువకులను అరెస్ట్‌చేశారు. నిందితులు నల్గొండ జిల్లాలోని దేవరకొండకు చెందిన ముడావత్ ప్రశాంత్, అఖిల్‌గా గుర్తించామని, వీరు వనస్థలిపురంలో ఉంటున్నట్లు తెలిపారు. ప్రశాంత్ ఓ ప్రముఖ సాఫ్ట్వేర్కంపెనీలో టీం లీడర్‌గా చేస్తున్నాడని, అఖిల్ ఇంటర్ ఫెయిలై ఖాళీగా ఉంటున్నాడని చెప్పారు. ఇద్దరూ కారును రెంట్‌కు తీసుకొని మద్యం సేవించి, పోకిరి చేష్టలు చేసినట్లు సీఐ పేర్కొన్నారు.