అంబులెన్స్ డ్రైవర్ కమీషన్ కక్కుర్తి..నిండు ప్రాణం బలి

అంబులెన్స్ డ్రైవర్ కమీషన్ కక్కుర్తి..నిండు ప్రాణం బలి
  •      నిందితుడిని అరెస్టు చేసిన  మంచిర్యాల పోలీసులు

మంచిర్యాల, వెలుగు : అంబులెన్స్ డ్రైవర్ కమీషన్ కక్కుర్తికి ఓ నిండు ప్రాణం బలైంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్​ చేశారు.  మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ కథనం ప్రకారం.. జైపూర్ మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన తోకల సాగర్ (36) మంచిర్యాలలో అంబులెన్స్ ఓనర్ కమ్ డ్రైవర్. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో మంచిర్యాల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు వచ్చే రోగులను తన అంబులెన్స్ ద్వారా అత్యవసర చికిత్స నిమిత్తం తనకు కమీషన్లు ఇచ్చే కరీంనగర్ లోని అకిరా హాస్పిటల్ కు తరలిస్తున్నాడు. ఇలా ఒక్కో పేషెంట్ కు హాస్పిటల్ నుంచి 25 నుంచి 30 శాతం కమీషన్ తీసుకుంటున్నాడు.

 మార్చి 29న మ్యాదరి సింధూజ (35)కు యాక్సిడెంట్ కావడంతో కుటుంబసభ్యులు మంచిర్యాల హాస్పిటల్ కు తీసుకువచ్చారు. కండిషన్ సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ కు రెఫర్​చేశారు. బాధితురాలి కుటుంబసభ్యులు సాగర్ ను సంప్రదించగా, వారి నిర్ణయానికి వ్యతిరేకంగా మంచిర్యాలలోని వసుధ హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. పేషెంట్​బంధువులు కరీంనగర్ లోని కెల్విన్ హాస్పిటల్ కు తీసుకెళ్లాలని కోరగా వారి మాటను లెక్కచేయకుండా అఖీరా హాస్పిటల్ కు తీసుకెళ్లాడు.

 ఆ హాస్పిటల్ లో సరైన వసతులు లేవని, నిపుణులైన డాక్టర్స్ లేరని  తెలిసినప్పటికీ, సరైన వైద్యం అందకపోతే పేషెంట్​చనిపోతుందన్న విషయం తెలిసి కూడా కమీషన్ కోసం కక్కుర్తి పడ్డాడు. హాస్పిటల్ లో దాదాపు ముప్పావు గంట కాలాయాపన చేయించి కెల్విన్ హాస్పిటల్ లో చేర్పించాడు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తుండగానే సింధూజ బ్రెయిన్ డెడ్ అయింది. అరగంట ముందు తీసుకువస్తే పేషెంట్ కి ఈ పరిస్థితి వచ్చేది కాదని అక్కడి డాక్టర్లు చెప్పారు.

 అనంతరం ఆమెను తీసుకొచ్చి మంచిర్యాల జీజీహెచ్ లో చేర్పించగా, గురువారం చనిపోయింది. దీతో సింధూజ కుటుంబ సభ్యులు సాగర్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి ఎంక్వయిరీ చేయగా, తన వల్లే సింధూజ చనిపోయిందని సాగర్ ఒప్పుకొన్నట్టు ఏసీపీ ప్రకాష్ తెలిపారు. శుక్రవారం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్ కు తరలించామన్నారు.