హైదరాబాద్ నగరంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యవహరించిన తీరు పలువురికి ఆగ్రహం తెప్పిస్తోంది. నారాయణగూడలో అంబులెన్స్ డ్రైవర్ అత్యవసర సైరన్ మోగించడంతో ట్రాఫిక్ పోలీసు సిగ్నల్‌ను క్లియర్ చేశారు. సిగ్నల్ దాటిన తర్వాత కాస్త ముందుకెళ్లిన అతడు వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి.. బజ్జీలు, కూల్ డ్రింక్‌లు కొనుక్కున్నాడు. దీనిని గమనించిన పోలీస్ కానిస్టేబుల్ వెంటనే వాహనం దగ్గరకు వచ్చి అందులో రోగి ఎవరూ లేరని తేల్చారు.
అంబులెన్స్‌లో రోగి ఎవరైనా ఉన్నారేమో అనుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశానని, బజ్జీల కోసం సైరన్ ఎందుకు మోగించావంటూ అంబులెన్స్ డ్రైవర్‌ను ప్రశ్నించారు. అయితే, వాహనంలో రోగి ఉన్నాడని చెప్పేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ దృశ్యాలను ట్రాఫిక్ కానిస్టేబుల్ వీడియో తీశారు. ఈ వీడియోను డీజీపీ అంజనీ కుమార్ తాజాగా ట్వీట్ చేశారు. అత్యవసర సమయాల్లో ఉపయోగించే సైరన్‌ను దుర్వినియోగం చేయొద్దంటూ అంబులెన్స్ డ్రైవర్‌కు సూచించారు. లేదంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు
