ఫారెస్ట్ ఏరియాల్లో మొరాయిస్తున్న అంబులెన్స్​లు

ఫారెస్ట్ ఏరియాల్లో మొరాయిస్తున్న అంబులెన్స్​లు
  • కొత్త వాటికి ప్రపోజల్స్ పంపినా పట్టించుకోని సర్కారు
  • మన్యంలో వైద్యసేవలు పూర్​
  • పేషంట్లకు తప్పని ఇక్క ట్లు

భద్రాచలం, వెలుగు: మన్యంలో వైద్యసేవలు పూర్​గా మారాయి. ఎమర్జెన్సీ టైంలో ఆదుకునే అంబులెన్స్​లకు రిపేర్​జబ్బు పట్టిపీడిస్తోంది. వాటి స్థానంలో కొత్త వాహనాలకు ప్రపోజల్స్ పంపినా సర్కార్​పట్టించుకోవడం లేదు. ఫలితంగా ఎమర్జెన్సీ టైంలో అడవుల్లో ఆగిపోతున్నాయి. దీంతో కీకారణ్యంలో పేషంట్ల ప్రాణాలను హరిస్తున్నాయి. ఇందుకు తాజా ఉదాహరణ చర్ల మండలంలో ఓ యువతి పురుగుమందు తాగగా 108కి కాల్​ చేశారు. అంబులెన్స్​మండలకేంద్రంలోని హాస్పిటల్​కు తరలిస్తుండగా మొరాయించింది. దీంతో ఆ యువతి హాస్పిటల్​కు చేరుకోవడం ఆలస్యమై ప్రాణాలు విడిచింది. ఇలాంటి ఘటనలు మన్యం ఏరియాలో నిత్యకృత్యమవుతున్నాయి. అంబులెన్స్​ల కొరత, ఉన్నవాటికి మెయింటనెన్స్​లేకపోవడమే అసలు సమస్య అని పలువురు వాపోతున్నారు. 

అంబులెన్స్​లకు రిపేర్​జబ్బు

భద్రాచలం మన్యంలో అంబులెన్స్​లకు రిపేర్​జబ్బు పట్టిపీడిస్తోంది. దీంతో పేషంట్లకు సరిగా సేవలు అందని పరిస్థితి. భద్రాద్రికొత్తగూడెం జిల్లా చాలావరకు ఫారెస్ట్​ఏరియా కావడంతో వీరికి రవాణా సౌకర్యం తక్కువ. ఉన్నా రోడ్లు సరిగా ఉండవు. వీరికి హెల్త్​ఎమర్జెన్సీ టైంలో ప్రభుత్వ అంబులెన్స్​లే దిక్కు. ప్రస్తుతం వీటి కారణంగానే పేషంట్లు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు, పాముకాటు బాధితులు, ఆత్మహత్యాయత్నాలు.. తదితర ఎమర్జెన్సీ టైంలో అంబులెన్స్​ల సేవలు కీలకం. ఇలాంటి టైంలో అవి అడవిలో నిలిచిపోతుండటంతో పేషంట్ల ప్రాణాలు గాల్లో దీపమవుతున్నాయి. తాజాగా చర్ల మండలం రాళ్లాపురం గ్రామానికి చెందిన మడవి చుకిడీ(25) అనే యువతి పురుగుమందు తాగింది. 108 అంబులెన్స్​లో చర్ల హాస్పిటల్​కు తరలిస్తుండగా మార్గమధ్యలో మొరాయించింది. పేషంట్​బంధువులు కిందికి వాహనాన్ని నెట్టినా ముందుకు కదల్లేదు. దీంతో ఓ బైక్​పై ఆ యువతిని ఎక్కించుకుని హాస్పిటల్​కు పోయేసరికి అప్పటికే ప్రాణాలు పోయాయని డాక్టర్లు చెప్పారు. ఎమర్జెన్సీ టైంలో ఆదుకోవాల్సిన అంబులెన్స్ రిపేర్​కారణంగా ఆ యువతి ప్రాణాలు పోయాయి. గతంలో చుంచుపల్లి మండలంలో త్రీఇంక్లైన్​ ఏరియాలో కూడా ఆవు, దూడను బైక్​తో ఢీకొట్టి అపస్మారక స్థితికి చేరిన యువకుడిని తీసుకెళ్లేందుకు 108కు ఫోన్​ చేస్తే అది రిపేర్​లో ఉండి రాకపోవడంతో ఆటోలో తీసుకెళ్లాల్సి వచ్చింది. 

రిపేర్ కు వస్తే ఖమ్మానికే...

భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 108 వాహనాలు 21 వరకు ఉన్నాయి. చర్ల, దుమ్ముగూడెం, పినపాక, అశ్వాపురం, గుండాల, ఇల్లెందు, జూలూరుపాడు, చండ్రుగొండ మండలాల్లోని 8 అంబులెన్స్​లు పాడైపోయాయి. తరుచూ రిపేర్లకు గురవుతున్నాయి. టేకులపల్లి, చండ్రుగొండ, ఇల్లెందు మండలాల అంబులెన్స్​లైతే పూర్తిగా పాడైపోయాయి. భద్రాచలం, బూర్గంపాడు, కరకగూడెం వాహనాలు రిపేర్లతో నడిపిస్తున్నారు. వీటి మెయింటనెన్స్, పర్యవేక్షణ సరిగా ఉండటం లేదు. రిపేర్ వస్తే ఖమ్మంలోని వెల్డర్​ వద్దకు తీసుకెళ్లాల్సి వస్తోంది. జీవీకే సంస్థ ఆధ్వర్యంలో నడిచే 108 అంబులెన్స్​లకు ఖమ్మంలోనే రిపేర్లు చేస్తున్నారు.  క్రెడిట్​వెల్డర్ బిల్లులు వచ్చేంత వరకు వారే ఖర్చు భరిస్తున్నారు. బయట ఎక్కడైనా రిపేర్​ చేయిస్తే వెంటనే బిల్లులు చెల్లించాలి. ఈకారణంగా170 కిలోమీటర్ల దూరంలో ఉన్న చర్ల అంబులెన్స్​ను ఖమ్మంకు రిపేర్​ కోసం తీసుకెళ్లాల్సి వస్తోంది. అంతదూరం తీసుకెళ్లాలన్నా మరో వాహనం కావాల్సి వస్తుండటంతో మూలన 
పడేస్తున్నారు. ఫలితంగా రోగులకు ఇబ్బందికరంగా మారింది.