- దుర్వాసన, పొగతో అవస్థలు పడుతున్న ప్రజలు
అమీన్పూర్, వెలుగు: అమీన్పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ సమీపంలో ఉన్న డంప్యార్డు ప్రజలకు ప్రాణసంకటంగా మారింది. దీని నుంచి వచ్చే దుర్వాసనతో కాలనీ వాసులు ప్రశాంతత కోల్పోతున్నారు. డోర్లు మూసుకొని ఇంట్లో ఉన్నప్పటికీ వాసన ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. డంప్‌యార్డులో చెత్తకు మంటలు అంటుకుని దట్టమైన మంటలు, పొగ నివాసాలను కమ్మేస్తున్నాయి. దీంతో ఊపిరాడక అవస్థ పడుతున్నారు. దాదాపు అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధి నుంచి రోజుకు 150 టన్నుల చెత్తను డంప్‌యార్డ్‌కు తరలిస్తున్నారు.
గత నవంబర్‌తో రాంకీ సంస్థతో ఉన్న ఒప్పందం ముగియడంతో డంప్ యార్డు నుంచి చెత్త తరలింపు నిలిచిపోయింది. డిసెంబర్ నుంచి చెత్త తరలింపు సజావుగా జరగకపోవడంతో డంప్‌యార్డులో చెత్త కొండలా పేరుకుపోయింది. అధికారులు తొలగింపు చర్యలు చేపట్టినా డంప్‌యార్డుకు తరలించే చెత్త ఎక్కువగా ఉంటుంది. మరో వైపు నివాసాల మధ్య నుంచి డంప్ యార్డును పూర్తిగా తొలగించాలని అమీన్పూర్ పీపుల్స్ అసోసియేషన్ డిమాండ్చేస్తోంది. ఇటీవల సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజనను కలిసి డంప్యార్డు తొలగించాలని వినతి పత్రాన్ని అందజేశారు.
