డబ్ల్యూహెచ్వోకు అమెరికా గుడ్బై.. ఆ సంస్థ కమిటీల నుంచీ వైదొలగినట్టు ప్రకటన

డబ్ల్యూహెచ్వోకు అమెరికా గుడ్బై.. ఆ సంస్థ కమిటీల నుంచీ వైదొలగినట్టు ప్రకటన
  • రూ. 2 వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉన్న యూఎస్  

వాషింగ్టన్:  ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో)కు అమెరికా గుడ్ బై చెప్పింది. ఆ సంస్థ నుంచి బయటకు వస్తున్నామని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఏడాది క్రితమే ప్రకటించగా.. తాజాగా గురువారం (జనవరి 24) అధికారికంగా వైదొలగింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని డబ్ల్యూహెచ్​వో ఆఫీసుల్లో ఉన్న తమ సిబ్బందిని వెనక్కి పిలిపించామని అమెరికా హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ విభాగం వెల్లడించింది. 

కరోనా మహమ్మారిని కంట్రోల్ చేయడంలో, సంస్కరణలను అమలు చేయడంలో డబ్ల్యూహెచ్ వో ఫెయిల్ అయిందని.. సైంటిఫిక్​గా ఆ సంస్థ తీవ్ర అలసత్వం ప్రదర్శించిందని ఆరోపించింది. డబ్ల్యూహెచ్​వోకు చెందిన అన్ని కమిటీలు, వర్కింగ్ గ్రూపుల నుంచి కూడా బయటకు వచ్చినట్టు తెలిపింది. అయితే, డబ్ల్యూహెచ్ వో నుంచి బయటకు వచ్చినప్పటికీ, ఆ సంస్థతో కలిసి కొంత పరిమితి మేరకు పనిచేస్తామని పేర్కొంది. 

డబ్ల్యూహెచ్ వో నుంచి వైదొలగిన అమెరికా ఆ సంస్థకు సుమారు 260 మిలియన్ డాలర్లు (రూ. 2,389 కోట్లు) బకాయిలు చెల్లించాల్సి ఉందని ‘బ్లూమ్ బర్గ్’ మీడియా సంస్థ వెల్లడించింది. ఈ నేపథ్యంలో డబ్ల్యూహెచ్ వో అధికారులు స్పందిస్తూ.. సంస్థకు బకాయిలు చెల్లించేంత వరకూ అమెరికా ఉపసంహరణ అధికారికంగా పూర్తికాదన్నారు. అయితే, వైదొలగడానికి ముందు బకాయిలను పూర్తిగా చెల్లించాలన్న చట్టబద్ధమైన నిబంధన ఏదీ లేదని అమెరికా అధికారులు చెప్తున్నారు. కాగా, అమెరికా వైదొలగడంతో ఆ సంస్థ కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.