కరోనా పుట్టిందెక్కడ?

కరోనా పుట్టిందెక్కడ?
  • తేల్చాలంటూ ఇంటెలిజెన్స్ సంస్థలకు బైడెన్ ఆదేశం 

వాషింగ్టన్: ‘‘ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ ఫస్ట్ ఎట్ల షురువైంది? చైనాలోని వుహాన్ సిటీలో యానిమల్ మార్కెట్​లో జంతువుల నుంచే ఇది మనుషులకు వ్యాపించిందా? లేకపోతే వుహాన్ లోని ల్యాబొరేటరీ నుంచే లీక్ అయిందా?’’ తేల్చి చెప్పాలంటూ బుధవారం అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థలను ప్రెసిడెంట్ జో బైడెన్ ఆదేశించారు. దీనిపై దర్యాప్తు జరిపి, 90 రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్లు వైట్ హౌస్ అధికారులు ప్రకటించారు. కరోనా చైనాలోని వుహాన్ లోనే మొదలై ప్రపంచమంతా వ్యాపించిందన్న విషయంలో డౌట్ లేకున్నా.. అది ఎలా మొదలైందన్న దానిపై ప్రధానంగా రెండు వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దీనిపై దర్యాప్తు చేసిన అమెరికా అధికారుల్లో కొందరు..  వుహాన్ మార్కెట్​లో జంతువుల నుంచే మనుషులకుఈ వైరస్ అంటిందని.. మరికొందరు ల్యాబ్ నుంచి లీక్ కావడం వల్లే వ్యాపించిందని తేల్చారు. గత రిపబ్లికన్ ప్రెసిడెంట్ ట్రంప్ హయాంలోనూ దీనిపై ఇన్వెస్టిగేషన్ జరిగింది. రిపబ్లికన్లు చైనాను టార్గెట్ చేస్తూ.. కరోనా వుహాన్ ల్యాబ్ నుంచే లీకైందని ఆరోపించారు. కరోనాకు తామే బాధ్యులమన్న ఆరోపణలను చైనా ఖండించింది. దీనిపై అమెరికా అధికారుల మధ్యే ఏకాభిప్రాయం లేకపోవడంతో,  ఏదో ఒక కచ్చితమైన నిర్ణయం చెప్పాలంటూ ప్రెసిడెంట్ బైడెన్ మళ్లీ ఇన్వెస్టిగేషన్​కు ఆదేశించారని వైట్ హౌస్ తెలిపింది.