వాషింగ్టన్: వచ్చే ఏడాది తాను భారత్‌లో పర్యటిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గొప్ప వ్యక్తి అని, తన మిత్రుడు కూడా అని తెలిపారు. భారత్‌తో వాణిజ్య చర్చలు సానుకూలంగా ముందుకు సాగుతున్నాయని చెప్పారు. గురువారం వైట్‌హౌస్‌లో ప్రెసిడెంట్ కు సంబంధించిన ఓవల్ ఆఫీసులో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
" భారత ప్రధాని మోదీ నా మిత్రుడు. మేమిద్దరం తరచూ మాట్లాడుకుంటాం. నేను భారత్‌కు రావాలని ఆయన కోరుకుంటున్నారు. దాని గురించి మేం ఆలోచిస్తాం. మోదీ గొప్ప వ్యక్తి" అని పేర్కొన్నారు. వచ్చే ఏడాది భారత్ వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారా అని ఓ జర్నలిస్ట్ అడగగా.."అవును.. ఉండొచ్చు" అని ట్రంప్ బదులిచ్చారు.
అంతేగాక, భారత్ తో వాణిజ్య చర్చలు ఎలా జరుగుతున్నాయనే ప్రశ్నకు సమాధానంగా.."ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు బాగానే జరుగుతున్నాయి. మోదీ రష్యా నుంచి చమురు కొనడం మానేశారు" అని ట్రంప్ మరోసారి పేర్కొన్నారు.
