బాగ్దాద్: ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో అమెరికన్ జర్నలిస్టు షెల్లీ కిటిల్సన్‌ను మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసినట్లు ఆమె పనిచేస్తున్న మీడియా సంస్థ ధ్రువీకరించింది. ఆమెను రక్షించేందుకు ఇరాక్ అధికారులతో కలిసి చర్యలు తీసుకుంటున్నట్లు ఓ అమెరికా అధికారి తెలిపారు. ఇరాన్‌కు అనుకూలంగా ఉన్న “కతైబ్ హిజ్బుల్లా” మిలీషియా గ్రూప్ బెదిరించిందని, వారిపైనే అనుమానాలు ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
ఈ గ్రూప్‌తో సంబంధాలున్న అనుమానితుడిని ఇరాకీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు అమెరికా సహాయ విదేశాంగ కార్యదర్శి డైలాన్ జాన్సన్ ఎక్స్పోస్ట్లో తెలిపారు. మధ్యప్రాచ్యం, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాలపై ప్రత్యేక రిపోర్టింగ్ చేసే కిటిల్సన్ టార్గెట్‌గా కిడ్నాప్ లేదా హత్యకు కుట్ర జరుగుతుందని అమెరికా ప్రభుత్వం ముందే హెచ్చరించింది. ఆమె ఇరాక్‌లోనే రిపోర్టింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అమెరికా వార్తా సంస్థ ‘అల్-మానిటర్’ ఆమెను సురక్షితంగా విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
