ఎల్నినో ఎఫెక్ట్: వర్షాలు 10 శాతం తగ్గితే ఏ వస్తువుల రేట్లు పెరగబోతున్నాయో తెలుసా?

ఎల్నినో ఎఫెక్ట్: వర్షాలు 10 శాతం తగ్గితే ఏ వస్తువుల రేట్లు పెరగబోతున్నాయో తెలుసా?

భారతదేశంపై ఎల్‌ నినో ప్రభావంతో పాటు ఈ ఏడాది నైరుతి రుతుపవనాల వర్షపాతంలో 10% లోటు ఉండవచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ బలహీనమైన వర్షాలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంటల దిగుబడి తగ్గి.. టొమాటోలు, ఉల్లిపాయలు, పాలు, తృణధాన్యాలు వంటి నిత్యావసరాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది దేశంలో ఆహార ద్రవ్యోల్బణాన్ని తీవ్రం చేయనుంది.

వాతావరణ శాఖ అంచనా ప్రకారం.. ఈసారి వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 90% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది. గత 25 ఏళ్లలో వచ్చిన 7 ఎల్‌ నినో పరిస్థితుల్లో 6 సార్లు ఇలాగే తక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణంగా వర్షపాతంలో ప్రతి 1% తగ్గితే అది వ్యవసాయ వృద్ధి రేటును  0.4% మేర దెబ్బతీస్తుంది. మన దేశ కన్జూమర్ ప్రైస్ ఇండెక్స్ లో ఆహార పదార్థాల వాటా 37% ఉండటంతో.. పంటలు దెబ్బతింటే సామాన్యుడిపై భారం పడటం ఖాయం.

టొమాటో, ఉల్లిపాయలపై ప్రభావం
దేశంలో ఎండల తీవ్రత కారణంగా ఇప్పటికే మే నెలలోనే టొమాటో ధరలు ఏకంగా 34% పెరిగాయి. రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గితే ఈ ధరలు మరింత మండిపోనున్నాయి. ప్రస్తుతానికి ఉల్లి నిల్వలు ఉన్నప్పటికీ.. ఆగస్టు-అక్టోబర్ మధ్య వచ్చే ఖరీఫ్ ఉల్లి సాగుపై తక్కువ వర్షపాతం దెబ్బకొట్టనుంది. దీనివల్ల ఈ ఏడాది ద్వితీయార్థంలో ఉల్లి ధరలు కూడా ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని వ్యవసాయ నిపుణులు అంచనా వేస్తున్నారు.

పాలు, తృణధాన్యాల ధరల మంట
తీవ్రమైన ఎండలు, పశుగ్రాసం కొరత కారణంగా పాడి దిగుబడి తగ్గి పాలు, పాల ఉత్పత్తుల ధరలు పెరగనున్నాయి. ఇక తృణధాన్యాల విషయానికి వస్తే.. భారత్‌లో వరికి నీటి పారుదల సౌకర్యం ఉన్నప్పటికీ, ఎల్‌ నినో ప్రభావంతో థాయిలాండ్, వియత్నాం వంటి దేశాల్లో వరి సాగు దెబ్బతిని ప్రపంచవ్యాప్తంగా ధాన్యాల ధరలు పెరగొచ్చు. ఆ ప్రభావం మన దేశంపై కూడా పడుతుందట.

సాధారణ సంవత్సరాలతో పోలిస్తే ఎల్‌ నినో కాలంలో ఆహార ద్రవ్యోల్బణం 1.7% అదనంగా పెరుగుతుందని గత చరిత్ర చెబుతోంది. ఈ ఆర్థిక సంవత్సరంలో వినియోగదారుల ధరల ద్రవ్యోల్బణం సగటున 5.1% ఉండొచ్చని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ అంచనా వేసింది. అయితే 2022 తర్వాత అత్యధికంగా ఏప్రిల్ 2026 నాటికి దేశంలోని జలాశయాల్లో నీటి నిల్వలు 41% ఉండటం ఒక్కటే ప్రస్తుతం కాస్త ఉపశమనం కలిగించే అంశం. రాబోయే రుతుపవనాలపైనే సామాన్యుడి వంటింటి బడ్జెట్ ఆధారపడి ఉండనుందని ఈ పరిస్థితులు హెచ్చరిస్తున్నాయి.